బెంగళూరు : కర్టాటకలో మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలపై చిత్రదుర్గ లోని లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుఘా శరణును పోలీసులు సోమవారం నిర్బంధం లోకి తీసుకున్నారు. మఠానికి అనుబంధంగా ఉండే హైస్కూలులో చదువుకుంటున్న బాలికలపై అత్యాచార ఆరోపణల కింద హవేరీ జిల్లాలో ఆయనను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఇద్దరు మైనర్ బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం లోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. మఠం నిర్వహణ లోని పాఠశాల వార్డెన్ సహా నలుగురిపై కేసులు నమోదయ్యాయి.
మురుగ మఠం ఆధ్వర్యం లోని హాస్టల్‌లో ఉంటున్న 15,16 ఏళ్ల మైనర్ బాలికలు ఇద్దరు లైంగిక దాడుల విషయాన్ని జిల్లా సంక్షేమ కమిటీ దృష్టికి తెచ్చారు. అదే ఫిర్యాదును పోలీస్ స్టేషన్‌కు సమర్పించారు. మూడున్నరేళ్లుగా తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ బాలికలిద్దరూ ఆరోపణలు చేశారు. కాగా, ఇది కేవలం ఈ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, సంస్థలో చదువుతున్న పలువురు అమ్మాయిలను కూడా శివమూర్తి వేధిస్తున్నట్టు ఎన్‌జీవో సంస్థ ఒడనడి సేవా సంస్థ అధిపతి స్టాన్లీ ఆరోపించారు.
ఇది చాలా కాలంగా జరుగుతోందని, భయం కారణం గానే విద్యార్థులు ఇంతవరకు బయటకు చెప్పలేదని అన్నారు. ఎలాంటి బెదరింపులు వచ్చినా తాము వెనుకాడేది లేదని, పిల్లల హక్కుల పరిరక్షణ తమ సొసైటీ బాధ్యతని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారని, విచారణ పూర్తయితే నిజాలు బయటకు వస్తాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. చిత్రదుర్గలో పోస్కో, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.