కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో సీబీఐ, ఈడీ దాడుల కేసులు పెరుగుతుండటం పట్ల ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. బెంగాల్‌లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ చేపడతామని ఆమె హెచ్చరించారు. టీఎంసీ విద్యార్థి విభాగం సోమవారం చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి మమతాబెనర్జీ మాట్లాడారు. సీబీఐ, ఈడీ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఇక్కడ కేసులు ఉన్నాయని, మా అధికారులను మీరు ఢిల్లీ పిలిస్తే, తాను మీ అధికారులను పిలిపిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వ అధికారులపై కేసులు ఉన్నాయని చెప్పారు. కేంద్రం సిబిఐ ద్వారా తమ వారిని అరెస్ట్ చేయిస్తోందని, తాను ఇవన్నీ గమనం లోకి తీసుకుంటున్నానని చెప్పారు. బిల్కిస్‌బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడిచిపెట్టిన ఉదంతంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ టిఎంసి కోల్‌కతాలో 48 గంటల పాటు ధర్నాకు పిలుపిచ్చిందని మమతాబెనర్జీ పేర్కొన్నారు.