న్యూఢిల్లీ: బెంగళూరులోని ఈద్గా మైదానంలో గణేశ్ చతుర్థి ఉత్సవాలను నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కర్ణాటక వక్ఫ్‌బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. కాగా కర్ణాటక ప్రభుత్వం ఈద్గా మైదానంలో గణేశ్ చతుర్థి ఉత్సవాలను నిర్వహించేందుకు అనుమతిచ్చింది. దీనిపై వక్ఫ్‌బోర్డు హైకోర్టులో పిటిషన్ వేయగా ప్రభుత్వానికి అనుమతిచ్చే అధికారం ఉందని వ్యాఖ్యానించింది. అనంతరం బోర్డు సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించింది. గత 200ఏళ్లుగా ఇతర ఏ మతపరమైన ఉత్సవాలు అక్కడ నిర్వహించలేదని తెలిపింది. దీంతో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం..ఈద్గా మైదానంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కాగా ఈ విషయంలో ఈద్గా మైదానం ప్రభుత్వానికి చెందిందా లేక వక్ఫ్‌బోర్డుకు చెందిందా అనే ప్రశ్న తలెత్తింది. ఈ కీలకాంశాన్ని హైకోర్టు తేల్చాల్సి ఉంది. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వ తరఫున న్యాయవాది మాట్లాడుతూ కేవలం రెండురోజులపాటు జరిగే ఉత్సవాల కోసం మాత్రమే దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు.
శాశ్వత ప్రాతిపదికన ఎటువంటి నిర్మాణాలు చేయడంలేదని తెలిపారు. దీనిపై బోర్డు న్యాయవాది అభ్యంతర వ్యక్తం చేస్తూ బాబ్రీ మసీదు ఉదంతాన్ని ప్రస్తావించారు. 1992లో యూపీ సీఎం హామీ ఇచ్చినా బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందన్నారు.గతంలో చట్టప్రకారం ఈద్గా మైదానం వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆస్తిగా ప్రకటించారు. అకస్మాత్తుగా అది వివాదాస్పద ప్రాంతంగా పేర్కొని గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నారని సుప్రీం ధర్మాసనానికి బోర్డు న్యాయవాది దుష్యంత్ దవె విన్నవించారు. షెడ్యూల్ ప్రకారం 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే ఉత్సవాలకు అనుమతించిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వక్ఫ్‌బోర్డు వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బోర్డు న్యాయవాది దుష్యంత్ దవె వాదనతో ఏకీభవించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఎఎస్ ఓకా, ఎంఎ సంద్రేశ్‌తో కూడిన ధర్మాసనం ఈద్గా మైదానంలో గణేశ్ చతుర్థి ఉత్సవాలు నిర్వహించకుండా యథాతథస్థితిని కొనసాగించాలని స్టేటస్‌కో ఆర్డర్ జారీ చేసింది.