Friday, November 22, 2024

మహిళలపై నేరాలు

- Advertisement -
- Advertisement -

Atrocities against women and children have increased2021లో దేశంలో నేరాల సంఖ్య తగ్గిందని సంతోషించాలా, మహిళలు, పిల్లలపై అమానుషాలు పెరిగిపోయాయని ఆవేదన చెందాలా? అలాగే రోడ్ల ఆధునికీకరణ పెరుగుతున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గకపోడం, ద్విచక్ర వాహనాలపై ప్రయాణం ప్రమాదకారిగా కొనసాగుతూ ఉండడం దేనికి సంకేతం అనుకోవాలి? సామాజిక జీవనంలో అశాంతిని, రోడ్డు ప్రయాణంలో అభద్రతను జాతీయ నేర గణాంకాల బోర్డు 2021 నివేదిక ఎత్తి చూపించింది.ఈ నివేదిక ప్రకారం 2021లో నేరాల సంఖ్య అంతకు ముందరి సంవత్సరం (2020) తో పోల్చుకొంటే 7.6 శాతం తగ్గింది. జరుగుతున్న ప్రతి ఒక్క నేరం రికార్డుకు ఎక్కదు. రికార్డులకు ఎక్కిన వాటి ప్రకారమైనా నేరాల సంఖ్య తగ్గడం హర్షించదగిందే. ఆ విధంగా మొత్తం మీద జనజీవనంలో చట్టబద్ధత మెరుగైందనుకోవాలి. 2020లో ప్రతి లక్ష మంది జనాభాకు 487.8 నేరాలు రికార్డు కాగా, 2021లో ఈ సంఖ్య 445.9 కి తగ్గింది. 2021లో భారత శిక్షాస్మృతి కింద నమోదైన కేసుల సంఖ్య 13.9 శాతం తగ్గింది. అయితే రాష్ట్రాల అవినీతి నిరోధక విభాగాలు నమోదు చేసిన కేసుల సంఖ్య 2021లో 20 శాతం పెరిగాయి. ఈ కేసుల నమోదులో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అగ్ర భాగాన నిలిచింది.

2020తో పోల్చుకుంటే సైబర్ నేరాలు 2021లో 5.9 శాతం పెరిగాయి. అలాగే ఆర్ధిక నేరాల నమోదు 19.4 శాతం హెచ్చింది. ఈ సమాచారం ఆందోళనకరమైనది. బ్యాంకులను ముంచేసే ఘరానా రుణ ఎగవేతలకు మన దేశం పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తుల అంటే ఎగవేసిన అప్పుల సంఖ్య 2022 మార్చి నాటికి ఆరేళ్లలో అతి తక్కువగా 5.9 శాతం వద్ద ఉంది. అయితే భారత దేశంలో మాత్రం ఇది ఇంకా అవధులు మీరి కొనసాగుతున్నదని ఇటీవలే ఒక నివేదిక వెల్లడించింది. 8.3 శాతంతో ఎగవేత బ్యాంకు రుణాల సంఖ్యలో రష్యా మొదటి స్థానంలో ఉంది, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, 5.2 శాతంతో ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి. చైనాలో వీటి సంఖ్య కేవలం 1.8 శాతమే. ఇండోనేసియాలో 2.6 శాతం కాగా, 1.1శాతంగా అమెరికాలో ఇవి అతి తక్కువగా నమోదయ్యాయి. దేశంలో మహిళలపై నేరాల సంఖ్య కొవిడ్ కాలం (2020)లో తక్కువగా రికార్డయ్యాయి. 2019లో 4.05 లక్షల కేసులు నమోదు కాగా, వాటి సంఖ్య 2020లో 3.05 లక్షలు మాత్రమే కావడం విశేషం.

కొవిడ్ కలిగించిన ప్రాణ భయం వల్ల పెరిగిన భౌతిక దూరం మహిళలను కొంత కాపాడిందనుకోవాలి. కొవిడ్ బాగా తగ్గుముఖం పట్టిన 2021లో మహిళలపై నేరాలు మళ్ళీ పెరిగాయి. 2020లో ఇవి 8.3 శాతం తగ్గగా, 2021లో 15.3 శాతానికి ఎగబాకాయి. మహిళలపై నేరాల పెరుగుదలలో పరాకాష్ఠకు చేరిన గృహ హింస కనబడుతున్నది. పురుషాహంకారం పడగ విప్పి కాటు వేస్తున్నదని బోధపడుతున్నది. ఇందుకు మహిళల్లో పెరిగిన చదువు, చైతన్యం కూడా కారణమే అనాలి. అలాగే భారతీయ మహిళల్లో అధిక శాతం సంప్రదాయాల చెరలో కొనసాగుతున్నవారే, వారిలో అధికులు ఆర్ధికంగా అస్వతంత్రులు. సంప్రదాయాల పేరిట తనపై సాగుతున్న అణచివేతను ఎదిరించాలనే కాంక్ష కూడా ఆమెకు శాపమవుతున్నది. ఆధునిక భారత రాజ్యాంగం ఆమెకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వాలు అక్కరకు రాకుండా పోతున్నాయి. ఆ మేరకు అవతరించిన చట్టాలు, మహిళా పోలీస్ స్టేషన్‌లు, హెల్ప్ లైన్లు కూడా తగినంతగా ఉపయోగపడడం లేదు. మహిళలపై భర్తల, వారి తరపు బంధువుల హింసకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి.

2019లో 30.9 శాతంగా ఉన్న ఈ కేసులు 2020లో 30 శాతంగా, 2021లో 31.8 శాతంగా నమోదయ్యాయి. స్త్రీని తనతో సమానురాలిగా పరిగణించే సంస్కారం పురుషుడిలో పెరగకపోడమే ఇందుకు కారణం. మహిళలపై గృహ హింస తర్వాత స్థానాన్ని, అత్యాచార యత్నంలో వారిపై దాడులకు దిగడం, అత్యాచారాలు, కిడ్నాప్‌లు ఆక్రమించుకొన్నాయి. అరేళ్ళలోపు బాలికలపై అత్యాచార ఘటనలు కూడా నమోదవుతున్నాయి. పిల్లలపై నేరాలు 2021లో 16 శాతం పెరిగాయి. వృద్ధులపై దౌర్జన్యాల్లో ఢిల్లీ అగ్రభాగాన వుంది. రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరమైన సంఖ్యలో కొనసాగుతున్నాయి. 2021లో ప్రతి గంటలో 18 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి, 426 మంది మరణించారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 2018లో గల 35.7 శాతం నుంచి 2021 నాటికి 44.5 శాతానికి చేరుకొన్నాయి. ద్విచక్ర వాహన ప్రమాద మరణాల్లో అత్యధికంగా 12 శాతం తమిళనాడులోనే సంభవించాయి. వాహన ప్రయాణ నియమాలపై అవగాహన లోపాలు, రోడ్ల అధ్వానస్థితి ఇందుకు ప్రధాన కారణాలని బోధపడుతున్నది. అటు సామాజిక, కుటుంబ జీవనంలో మహిళలకు, వృద్ధులకు, బాలలకు రక్షణ పెరగాలి. వారి పట్ల సమాజ దృష్టి కోణంలో మార్పు రావాలి. అలాగే ప్రయాణ భద్రత గణనీయంగా మెరుగుపడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News