Monday, December 23, 2024

దావుద్ ఇబ్రహీంపై రూ.25 లక్షల అవార్డు ప్రకటించిన ఎన్‌ఐఎ

- Advertisement -
- Advertisement -

NIA announced award of Rs 25 lakh on Dawood Ibrahim

ముంబై : అండర్‌వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) రివార్డు ప్రకటించింది. అతడిని అరెస్టు చేసేందుకు అవసరమయ్యే సమాచారం ఇస్తే రూ.25 లక్షలు ఇస్తామని వెల్లడించింది. దావుద్ ఇబ్రహీంతోపాటు అతడి అనుచరులు చోటాషకీల్‌పై రూ. 20 లక్షలు, హజి అనీసన్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావెద్ పటేల్ అలియాస్ జావెద్ చిక్నా, ఇబ్రహీం ముస్తక్ అబ్దుల్ రజాక్ మేమన్ అలియాస్ టైగర్ మెమన్‌పై రూ. 15 లక్షల చొప్పున రివార్డు ప్రకటిస్తున్నట్టు ఎన్‌ఐఎ అధికారులు గురువారం వెల్లడించారు.

వీరంతా 1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనలో నిందితులుగా ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు వీలుగా ఎలాంటి సమాచారం తెలిసినా దర్యాప్తు సంస్థకు చేరవేయాలని అధికారులు తెలిపారు. దావుద్ నిర్వహిస్తోన్న అంతర్జాతీయ ఉగ్ర ముఠా “డి కంపెనీ”పై ఎన్‌ఐఎ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, అండర్‌వరల్డ్ క్రిమినల్ సిండికేట్, మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల మంజూరు వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతోందని ఎన్‌ఐఎ పేర్కొంది. పాక్ ఆధారంగా పనిచేస్తోన్న లష్కరే తొయిబా , జైషే మహ్మద్, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రముఠాలకు కీలక సమాచారం అందిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే దావుద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్టు అధికారికంగా వెల్లడైంది. 1993 లో దేశ వాణిజ్య రాజధాని ముంబై వ్యాప్తంగా 12 చోట్ల కొన్ని గంటల వ్యవధిలో భీకర బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందిరి పైగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News