సంపాదకీయం: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏది చేసినా దాని వెనుక తప్పనిసరిగా పాలక పార్టీ రాజకీయ ప్రయోజనం వుండి తీరుతుంది. దాహార్తితో గొంతు ఎండిపోతున్న వారికి గుక్కెడు మంచినీళ్లు పోయడం వెనుకా ఇదే దృష్టి వుంటుంది. ప్రజా ప్రయోజనం కంటే సొంత ఓటు బ్యాంకు ఖాతాను గరిష్ఠ స్థాయికి పెంచుకునే దృష్టే పని చేస్తుంది. అందుకు బాగా ఉపయోగపడే ఎరువు కోసం సాగిస్తున్న అన్వేషణలో ఇప్పుడు ప్రధాని మోడీకి ఎరువుల సబ్సిడీయే అతి గొప్ప ఎరువుగా అంది వచ్చింది. ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీతో ఎరువులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలన్నీ ఇక నుంచి భారత్ పేరుతో వాటిని విక్రయించాలని కేంద్రం ఆగస్టు 24న ఒక ఉత్తర్వు జారీ చేసింది.
భారత్ యూరియా, భారత్ డిఎపి, భారత్ ఎంఒపి, భారత అనే పద్ధతిలో ప్రతి ఎరువు పేరు ముందూ భారత్ వచ్చేలా ప్రత్యేకంగా ఇచ్చే సంచుల్లోనే ఇక నుంచి ఎరువులను అమ్మాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా రూపొందే సంచులన్నీ ఒకే పరిమాణంలో వుంటాయి. వాటి ముందు భాగం లో మూడింట రెండొంతుల మేర భారత్ అని బ్రాండ్ పేరు వుంటుంది. మిగతా ఒక్క వంతు జాగాలోనే ఆ ఎరువును ఉత్పత్తి చేసే కంపెనీ తన సొంత డబ్బా వాయించుకోవాలి. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ‘ఒక జాతి ఒక ఎరువు’ విధానంగా పిలిచే ఈ కొత్త ప్రక్రియ కింద కొత్త సంచులు ఆ తేదీ నుంచే అందుబాటులోకి వస్తాయి. పాత డిజైన్‌లోని సంచుల కొనుగోలును కంపెనీలు ఈ నెల 16 నుంచి మానుకోవాలి. పాత డిజైన్ సంచులను మార్కెట్ నుంచి పూర్తిగా తొలగించడానికి 4 మాసాల వ్యవధి ఇస్తారు.
ప్రభుత్వ సబ్సిడీపై తయారవుతున్న ఎరువుల బ్యాగులన్నింటిమీద పేరును భారత్‌గా ముద్రించడాన్ని భారతీయ జన్‌ఉర్వారక్ పరియోజన (పిఎంబిజెపి) అని పిలుస్తారు. ఈ పేరులో ప్రధాన మంత్రి (పిఎం), బిజెపి రెండూ కలిసి వచ్చాయి. పాలక పార్టీకి ఇంతకంటే శక్తివంతమైన ప్రచార ప్రక్రియ ఇంకేముంటుంది! ఎరువుల ఉత్పత్తి వ్యయం భరిస్తున్నది కంపెనీలు కాదని రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న త్యాగమని తెలియజేయడం ఈ కొత్త విధాన ప్రధానోద్దేశాల్లో ఒకటని బోధపడుతున్నది. ఎరువులను అమ్మే కంపెనీలు, స్టేట్ ట్రేడింగ్ సంస్థలు, ఎరువుల మార్కెటింగ్ సంస్థలు ఈ కొత్త లోగోలున్న సంచుల్లోనే ఎరువులు విక్రయించాలి. పంటల సాగులో అత్యధికంగా వినియోగించే ఎరువు యూరి యా. ఉత్పత్తి వ్యయానికి 1020 శాతాన్ని కలుపుకొని యూరియా కనీస చిల్లర ధర(ఎంఆర్‌పి)ను నిర్ణయిస్తారు. దీని ఉత్పత్తి వ్యయంలో 8090 శాతం డబ్బును కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. డై అమ్మోనియం పాస్ఫేట్ (డిఎపి), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఒపి) వంటి ఇతర మిశ్రమ ఎరువుల ధరలపై ప్రభుత్వం కంట్రోల్ లేదు గాని వాటికి కూడా 65 శాతం వరకు సబ్సిడీ చెల్లింపు వుంది. అనేక కారణాల వల్ల ఎరువుల ఉత్పాదక వ్యయం, దిగుమతి ఖర్చులు బాగా పెరిగిపోయాయి.
ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఎరువుల ధరలూ పెరిగాయి. ఈ కారణంగా ఎరువులపై ప్రభుత్వం భరించే సబ్సిడీ విపరీతంగా ఎగబాకింది. ప్రభుత్వ సబ్సిడీ వ్యయంలో ప్రథమ స్థానం ఆహార సబ్సిడీది కాగా, రెండో స్థానం ఎరువుల సబ్సిడీది. 2022 23లో ఎరువుల సబ్సిడీ భారం రూ. 2 లక్షల కోట్లని అంచనా. ఎరువుల ఉత్పత్తి వ్యయంలో సబ్సిడీతోపాటు వాటి రవాణా ఖర్చులో కొంత భాగాన్ని కూడా ప్రభుత్వం భరిస్తున్నది. ఎక్కడ ఏ మతలబు జరుగుతున్నదో గాని ప్రభుత్వం ఇచ్చే ఎరువుల సబ్సిడీ ప్రయోజనం నేరుగా రైతులకు చేరడం లేదు. నానాటికీ సాగులో ఎరువుల భారం పెరిగిపోయి వారిని కుంగదీస్తున్నది. సబ్సిడీని ఎరువుల కంపెనీలకు ఇవ్వడానికి బదులు నేరుగా నగదు బదిలీ పద్ధతిలో రైతులకే ఇవ్వాలన్న మంచి సూచనను అమలు పరచడానికి కేంద్రానికి ఇంత వరకు చేతులు రావడం లేదు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలుకు ఎంచుకున్న సమయం చర్చించుకోదగినది.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇటువంటి సాహసాన్ని అది చేయలేకపోయింది. త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు గణనీయమైన సవాలు కావని పాలకపక్షం భావిస్తున్నందున ఇప్పుడు ఈ కొత్త ‘భారత్ బ్రాండ్’ ఎరువుల విధానాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇంతకు ముందు ఆయా ఎరువుల కంపెనీలు ఎరువులకు అదనపు గుణాన్ని చేకూర్చి తమ బ్రాండ్‌ను వాణిజ్య ప్రకటనల ద్వారా విశేషంగా ప్రచారం చేసుకునే వారు. అన్నింటికీ ‘భారత్ బ్రాండ్’ ఒక్కటే శరణ్యమైన తర్వాత వారికి ఆ ప్రచారావసరం తొలగిపోతుంది. కంపెనీలు కేవలం ఎరువుల దిగుమతిదారులుగాను, కాంట్రాక్టర్లుగానే మిగిలిపోతారు. ఎరువు బ్రాండ్ పేరు మార్చడం వల్ల రైతులకు ఆయా ఎరువుల నుంచి ఏమైనా హాని జరిగితే దాని దుష్ప్రభావం ప్రభుత్వం మీదనే పడుతుంది.