కొచ్చి: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో జరిగిన అంగరంగ వైభవోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు స్వదేశీ తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రవేశపెట్టారు(కమిషన్ఢ్). 45,000 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకను రూ. 20,000 కోట్లతో నిర్మించారు. 262 మీటర్ల పొడవు మరియు 62 మీటర్ల వెడల్పు, ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. ఇందులో మిగ్-29కె ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్‌లతో సహా 30 విమానాలు ఉండొచ్చు. ఈ యుద్ధనౌక దాదాపు 1,600 మంది సిబ్బందికి వసతి కల్పిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ యొక్క ప్రతిబింబం ఐఎన్‌ఎస్ విక్రాంత్ అని అన్నారు. “ఈ రోజు, భారతదేశం పెద్ద యుద్ధనౌకలను దేశీయంగా నిర్మించగల దేశాల జాబితాలోకి చేరింది. విక్రాంత్ కొత్త విశ్వాసాన్ని నింపింది” అన్నారాయన. ఈ సందర్భంగా కొత్త నౌకాదళ జెండాను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాన మంత్రి తన ప్రసంగంలో, కొత్త నావికా జెండాను అవలంబించడం ద్వారా భారతదేశం తన బానిసత్వ భారాన్ని తొల గించుకుందని అన్నారు.
యుద్ధనౌక దశాబ్దానికి పైగా నిర్మాణంలో ఉండింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ సముద్ర ప్రయోగాల యొక్క బహుళ దశలు గత ఏడాది ఆగస్టు 21 నుండి పూర్తయ్యాయి. నౌకాదళానికి ఆదేశం వచ్చిన తర్వాత ఏవియేషన్ ట్రయల్స్ నిర్వహించబడతాయి. ప్రస్తుతం, రష్యా ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య అనే ఒకే ఒక్క విమాన వాహక నౌక భారత్ వద్ద ఉంది. హిందూ మహాసముద్రం , బంగాళాఖాతంలోని రెండు ప్రధాన నౌకాదళ సరిహద్దుల కోసం రెండు వాహక నౌకలని, మరొకటి స్పేర్ లో కావాలని రక్షక దళాలు కోరుకుంటున్నాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన దాని పూర్వ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పేరునే తాజా నౌకకు పెట్టారు.