న్యూఢిల్లీ: రెండు నెలలుగా కస్టడీలో ఉన్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె తన పాస్‌పోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాక విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని సుప్రీం ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టుకు మరో సూచన కూడా చేసింది. తీస్తా సెతల్వాద్ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది.
అహ్మదాబాద్‌లో అల్లర్ల సమయంలో హత్యకు గురైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఫిబ్రవరి నాడు గోద్రా స్టేషన్ సమీపంలో 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ను ఒక గుంపు తగులబెట్టడం వల్ల తలెత్తిన అల్లర్లపై దాఖలు చేసిన పిటిషన్ ను జూన్ 24న సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. జూలై 30న అహ్మదాబాద్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో సెతల్వాద్ , మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్‌బి శ్రీకుమార్‌ల బెయిల్ దరఖాస్తులను తిరస్కరించింది. వారిని విడుదల చేస్తే, ఒక వ్యక్తి శిక్షపడకుండా కూడా ఆరోపణలు చేయవచ్చనే సందేశాన్ని పంపుతుందని పేర్కొంది. జూన్‌లో అరెస్టయిన సెతల్వాద్, శ్రీకుమార్ ఇద్దరూ గోద్రా అనంతర అల్లర్ల కేసుల్లో “అమాయకులను” ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను సృష్టించారని ఆరోపించారు. వారు ప్రస్తుతం సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. శ్రీకుమార్ బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు.