Monday, December 23, 2024

మళ్లీ శ్రీలంకకు చేరుకున్న గొటబాయ రాజపక్స..

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడానికి కారకుడయ్యాడన్న ప్రజాగ్రహంతో దేశం విడిచి పరారైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు 73 ఏళ్ల గొటబాయ రాజపక్స శుక్రవారం బాగా పొద్దుపోయిన తరువాత కొలంబోకు చేరుకున్నారు. ఈ ఏడాది జులై 13న దేశం విడిచి మాల్దీవులకు, అక్కడ నుంచి సింగపూర్, థాయ్‌లాండ్‌కు పరారైన గొటబాయ 51 రోజుల తరువాత చేరుకున్నారు. బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా కొలంబో లోని బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగానే అధికార పార్టీ శ్రీలంక పొడుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి) నాయకులు, మంత్రులు పూలమాలలతో స్వాగతం పలికారు. సాయుధులైన బలగాల రక్షణలో కట్టుదిట్టమైన భద్రతతో ఆయన విమానాశ్రయం నుంచి అధికారిక నివాసానికి బయలుదేరారు. ఆయన తిరిగి రాజకీయాలు ప్రారంభిస్తారని పార్టీ నాయకులు అనుకుంటున్నా, ఆయన రాజకీయాల్లోకి రారని అధికార పార్టీ ఎస్‌ఎల్‌పిపి కి చెందిన వర్గాలు వివరించాయి. పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు ఆయన తిరిగి రాజకీయాలలో రావడానికి ఇష్టపడడం లేదు. ఆయన నేరాలేం చేయలేదు కాబట్టి, తన స్వదేశానికి తిరిగి రావడానికి ఆయనకు హక్కు ఉంటుందని, మాజీ అధ్యక్షునిగా అన్ని సౌకర్యాలు పొందవచ్చని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. రాజపక్సకు ప్రత్యేక భద్రత కల్పించారు. “భద్రతా కారణాల దృష్టా ఆయనను గది నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కొంత సమయం కావాలన్నారు. ఇంట్లో కొన్నాళ్లు గడిపిన తరువాత, ఏం చేయాలనుకుంటున్నారో చెబుతారు” అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. రాజపక్స, ఆయన భార్య లోమా రాజపక్స, ఇద్దరు అంగరక్షకులు జులై 13న దేశం విడిచిపెట్టారు. మొదట మాల్దీవులకు తరువాత సింగపూర్‌కు, అక్కడ నుంచి థాయిలాండ్‌కు చేరుకున్నారు. సింగపూర్‌లో ఉండగానే అధ్యక్ష పదవికి జులై 14న రాజీనామా చేశారు.అయితే థాయిలాండ్ ప్రభుత్వం 90 రోజులు ఉండేందుకు మాత్రమే అనుమతించింది. ఈ నేపథ్యంలో స్వదేశానికి రావాలని రాజపక్స నిర్ణయించుకున్నారు. దాదాపు 50 రోజుల ప్రవాసం తరువాత శుక్రవారం థాయ్‌లాండ్ నుంచి సింగపూర్, అక్కడ నుంచి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో స్వదేశానికి తిరిగి వచ్చారు. కొలంబోలో విజేరమ మవాథాకు అత్యంత సమీపాన గల అధికారిక నివాసభవనాన్ని ఆయనకు కేటాయించారు. భద్రతాధికారుల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన హోటల్‌కే పరిమితం కావలసి ఉంటుంది.

Gotabaya Rajapaksa returns to Sri Lanka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News