న్యూఢిల్లీ: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ(54) ఆదివారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా పాల్గర్ జిల్లాలో ఆయన కారు డివైడర్‌ను డీకొట్టడంతో మిస్త్రీ దుర్మరణం చెందారు. 2012లో రతన్ టాటా రిటైర్మెంట్ తర్వాత టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన్ని ఆకస్మికంగా ఆయన్ని తొలగించారు. మిస్త్రీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
టాటా సన్స్‌లో ఏకైక అతిపెద్ద వాటాదారుడు అయిన పల్లోంజి మిస్త్రీ కుమారుడు సైరస్ మిస్త్రీ. అయితే టాటా సన్స్‌లో మిస్త్రీ కుటుంబానికి 18.5 శాతం వాటా ఉంది.
2012లో రతన్ టాటా పదవీవిరమణ చేపట్టిన తర్వాత టాటా సన్స్‌కు చైర్మన్ అయిన ఆరో వ్యక్తి, యువ చైర్మన్ మిస్త్రీనే కావడం గమనార్హం.
1994లో తండ్రి నుంచి బాధ్యతలు స్వీకరించి మిస్త్రీ టాటా సన్స్ బోర్డులో చేరారు. ఆయన కుటుంబం నడిపే షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌నకు చెందిన కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
మిస్త్రీ తల్లి ఐరిష్‌కు చెందినవారు కావడం వల్ల ఆయన ఐరిష్ పౌరుడు. 1968 జూలై 4న మిస్త్రీ ముంబైలో జన్మించారు.
1990లో లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నుంచి మిస్త్రీ సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ బిజినెస్ స్కూల్(1997) నుంచి మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్‌సి చేశారు.
మిస్త్రీ ఆధ్వర్యంలో షాపూర్జీ పల్లోంజి గ్రూప్ మరింత వృద్ధిని సాధించింది. ఇప్పుడు 23 వేల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. మధ్యప్రాచ్య, ఆఫ్రికాతో పాటు భారత్‌లో ఆయన సత్తా చాటారు.
2016 అక్టోబర్‌లో చైర్మన్‌గా టాటా సన్స్ నుంచి మిస్త్రీని తొలగించారు. ఆ తర్వాత ఆయన సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం చేశారు.
సైరస్‌కు ఇద్దరు సోదరీమణులు లైలా, అలూ ఉన్నారు. రతన్ టాటా సోదరుడు అలూ నోయెల్ టాటాను వివాహం చేసుకుంది.
మృదు సంభాషణ, నిష్కపటం, అణిగి మణిగి ఉంటారని మిస్త్రీకి పేరుంది. టాటా లాగే మిస్త్రీకి కార్లు అంటే ఇష్టం, ప్రత్యేకించి ఎస్‌యువిలను ఆయన ఇష్టపడతారు.
మిస్త్రీకి రేసింగ్ అంటే కూడా అభిమానం, ఆయన పుణెలోని 200 ఎకరాల్లో ఉన్న మంజ్రీ ఫార్మ్‌ను తరచూ సందర్శిస్తుండేవారు. ఇది దేశంలోనే అత్యంత పురాతనమైనది.