Saturday, November 23, 2024

కెసిఆర్ వైఖరి భేష్

- Advertisement -
- Advertisement -

KCR should fight against BJP consistently:CPI

బిజెపి వ్యతిరేక పోరాటం మంచి పరిణామం

ప్రజాస్వామ్య లౌకిక పార్టీలు కలిసి రావాలి సమాఖ్య విధానాన్ని పరిరక్షించుకునేందుకు
మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజా వ్యతిరేక బిజెపిని అధికారం నుంచి దూరం చేసేందుకు ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా చేతులు కలపాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. బిజెపి చేతిలో భారతదేశం సురక్షితంగా ఉండబోదన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, సమాఖ్య విధానాన్ని రక్షించుకునేందుకు 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని స్పష్టం చేశారు.

బిజెపికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సవాలు విసురుతున్నారని, ఇది మంచి పరిణామమని అభినందించారు. బిజెపిపై కెసిఆర్ స్థిరంగా పోరాడాలని, తెలంగాణ ప్రజలందరినీ కూడగట్టాలని కోరారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభ ఆదివారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇన్ఫాంట్ జీసెస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి జెడ్‌పి హైస్కూల్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కామ్రేడ్ సిద్ధి వెంకటేశ్వర్లు మైదానం(జెడ్‌పి హైస్కూల్ గ్రౌండ్)లో బహిరంగ సభ జరిగింది.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా డి.రాజా, గౌరవ అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శులు అతుల్ కుమార్ అంజాన్, డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా హాజరయ్యారు. వేదికపై రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, టి.శ్రీనివాసరావు, ఎన్. బాల మల్లేశ్, బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం.బాలనర్సింహా, వి.ఎస్.బోస్, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆసీనులయ్యారు. సభను ఉద్దేశించి డి.రాజా ప్రసంగిస్తూ బిజెపి అధికారంలో కొనసాగితే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని, భారత దేశం ఒక దేశంగా ఉండబోదని, దేశం ముందుకు సాగబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే దేశంలో శరవేగంగా మార్పు కనిపిస్తోందని, ప్రాంతీయ పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయని చెప్పారు.

తమిళనాడులో సీఎం స్టాలిన్ నేతృత్వంలో డిఎంకె సైతం బిజెపికి వ్యతిరకంగా సైద్ధాంతిక, రాజకీయ పోరాటం చేస్తోందని, బిహార్‌లో నితీశ్ కుమార్ బిజెపి కబంధ హస్తాల నుండి బైట పడి మహాకూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసారని, తాజాగా తెలంగాణ సీఎం కెసిఆర్ సైతం బిజెపిపై పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ నేల విప్లవాలతో పునీతమైన గడ్డ అని , కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిజాం రాచరిక విముక్తికి అద్భుతమైన పోరాటం చేసినందని గుర్తు చేశారు. నాటి పోరాటంలో బిజెపి మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్ పాత్రనే లేదన్నారు.అలాంటిది కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చి సెప్టెంబర్ 17 నుండి ఏడాది పాటు తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుతామనడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. అయితే రాజ్యాంగం స్థానంలో ప్రతీఘాతకమైన మనుస్మృతిని తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.

సభకు సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య స్వాగతం పలికారు. ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా నేతృత్వంలోని కళాకారులు తమ ఆట పాటలతో ఆకట్టుకోగా, మహిళా కోలా ట బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీని సంగీత దర్శకులు వందేమాతం శ్రీనివాస్ ‘ఎర్ర జెండ.. ఎర్రజెండ ఎన్నియ్యలో..’ పాటతో సభికులను ఉర్రూతలూగించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు, అభిమానలు సభకు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత వివిధ జిల్లాల నుండి వచ్చి శ్రేణులు ఒక చోట కలుసుకోవడంతో ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం కనిపించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News