దళితబంధు విస్తరణ సిఎం కెసిఆర్ సంకల్ప బలానికి నిదర్శనం
అంబేద్కర్ ఆశయసాధన దిశగా
వడివడిగా అడుగులు
లబ్ధిదారుల ఎంపిక నుంచి యూనిట్ల విజయవంతం వరకు
పకడ్బందీ చర్యలకు అధికారుల సమాయత్తం ప్రతి
నియోజవర్గానికి 1500మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా దళితుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందించాలన్న సంకల్పంతో సామాజిక ఆర్థిక అంతరాలను రూపుమాపాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని పక్కా ప్ర ణాళికతో అమలుచేస్తోంది. దళితుల ఆర్థ్ధిక సాధికారతే సంకల్పంగా సిఎం కెసిఆర్ ముందుకెళుతున్నారు. అందులో భాగంగా దశల వారీగా రాష్ట్రంలోని 100శాతం దళిత కుటుంబాలకు 100 శా తం ప్రభుత్వ ఆర్థ్ధిక సాయంతో ఎటువంటి బ్యాం కు రుణాలతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా తమకు నచ్చిన, నైపుణ్యం కలిగిన ఆర్థ్ధిక యూనిట్లను నెలకొల్పేలా, ఆయా దళిత కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం దళితులకు చేయూతనందిస్తోంది.
ఈ నేపథ్యంలోనే దళితబంధు పథకాన్ని ఈ ఏడాది మరింతగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేబినెట్‌లో సైతం నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ఇప్పటికే 100 మంది లబ్ధిదారులకు అందిస్తుండగా ఆ సంఖ్యను 1,500 మందికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరం నుంచే దీనిని అ మలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మరో 1,400 వందల మందికి అదనంగా ఆర్ధిక సాయం అందనుంది. అయితే మొదటి దశలో 500 మం ది చొప్పున 118 నియోజకవర్గాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇప్పటివరకు 36,392 మంది ఖాతాల్లో
రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం కింద ఇప్పటివరకు 36,392 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్ర భుత్వం ఇప్పటికే నిధులను జమచేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 31,088 యూనిట్ల పూర్తయ్యింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,402, వాసాలమర్రిలో 75, నాలుగు పైలట్ మండలాల్లో 4,808 దళితబంధు యూనిట్స్ విజయవంతంగా నడుస్తుండగా, మిగతా 118 నియోజకవర్గాల్లో 10,803 యూనిట్స్‌కు సంబంధించి లబ్ధిదారులు తమ యూనిట్లను ఎంపిక చేసుకున్నా రు. 2022,- 23 సంవత్సరంలో రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో 1,77,000 మందికి దళితబంధును అమలు చేయాలని, అందులో భాగంగా మొదటి దశలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున 59,000 మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. 2021 -22 ఆర్థ్ధికసంవత్సరానికి సంబంధించి దళితబంధు వివరాలు ఇలా …
కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కింద 18,211 మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయగా రూ.1,822 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమచేసింది. వాటిలో ఇప్పటివరకు 15,402 మంది లబ్ధిదారుల యూనిట్స్ ఎంపిక పూర్తయ్యింది. యాదాద్రి – భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రి గ్రామంలోని మొత్తం 75 మంది లబ్ధిదారుల ఖాతాలకు దళితబంధు కింద రూ.7 కోట్ల 60 లక్షలు నిధులను ప్రభుత్వం జమచేయగా 85 దళితబంధు యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యాయి. అంతే కాకుండా పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు మండలాలు (చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్) లో 100 శాతం దళిత కుటుంబాలకు దళితబంధు యూనిట్స్‌ను ప్రభుత్వం మంజూరుచేసింది. అందులో భాగంగా నిర్వహించిన సర్వేలో ఈ 4 మండలాల్లో 8,518 దళిత కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో 6,947 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేయగా, ఈ 4 మండలాల్లో ఇప్పటివరకు 4,808 దళితబంధు యూనిట్స్‌ల ఎంపిక పూర్తయ్యింది.
33 జిల్లాలోని 118 నియోజకవర్గంలో…
రాష్ట్రంలోని 33 జిల్లాలోని 118 నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళితబంధు కింద యూనిట్స్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొత్తం 11,835 దళితకుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో ఇప్పటివరకు 11,159 కుటుంబాల ఖాతాల్లో నిధులు జమచేయగా, 10,893 యూనిట్స్‌ల ఎంపిక పూర్తయ్యింది. దళితబంధు కింద 2021-, 22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 36,392 మంది లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం నిధులు జమచేయగా వారిలో 31,088 మంది లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. 2022,-23 బడ్జెట్‌లో కేటాయించిన రూ.17,700 కోట్ల నిధులను దళితబంధు పథకానికి సంబంధించి పూర్తిగా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 1,500 కుటుంబాల చొప్పున 118 నియోజకవర్గాల్లోని 1,77,00 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేయనుంది. ఈ సంవత్సరం మొదటి దశలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున మొత్తం 59,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.