Monday, December 23, 2024

టీమిండియాకు పరీక్ష.. నేడు లంకతో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఆసియాకప్ సూపర్4లో భాగంగా మంగళవారం జరిగే కీలక మ్యాచ్‌లో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్‌కు లంకతో పోరు కీలకంగా మారింది. ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవక తప్పదు. ఇక అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన శ్రీలంక ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ఫైనల్‌కు మరింత చేరువ కావాలని భావిస్తోంది. కానీ పటిష్టమైన టీమిండియాను ఓడించడం లంకకు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. పాక్ చేతిలో ఓడినంత మాత్రాన భారత్‌ను తక్కువ అంచనా వేయలేం. పాక్ చేతిలో ఓటమి పాలై విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఈసారి మాత్రం అలాంటి పొరపాటు చేయకూడదనే లక్షంతో ఉంది. కిందటి మ్యాచ్‌లో చేసిన పొరపాట్లాకు ఈసారి తావులేకుండా చూడాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు విరాట్ కీలకంగా మారాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ అర్ధ సెంచరీతో అలరించిన విషయం తెలిసిందే. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు ఈసారి కూడా బ్యాట్‌ను ఝులిపించాల్సిన అవసరం ఉంది. అంతేగాక సూర్యకుమార్, రిషబ్ పంత్, దీపక్ హుడా, హార్దిక్ తదితరులు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. బౌలింగ్ వైఫల్యం కూడా భారత్‌ను కలవరానికి గురిచేస్తోంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్, హార్ధిక్, చాహల్ తదితరులు భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన పరిచే అంశమే. ఈ మ్యాచ్‌లో బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమష్టిగా రాణిస్తేనే లంకపై భారత్‌కు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.
జోరుమీదుంది
ఇక కిందటి మ్యాచ్‌లో అఫ్గాన్‌ను ఓడించిన లంక ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. భారత్‌ను కూడా ఓడించి ఫైనల్‌కు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లంక ఫైనల్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఇలాంటి స్థితిలో సమష్టి పోరాటంతో భారత్‌ను ఓడించాలని లంక తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక బలంగానే ఉంది. అయితే నిలకడలేమి ఒక్కటే జట్టును ఆందోళన పరుస్తోంది. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే భారత్‌ను ఓడించడం అసాధ్యమేమీ కాదనే చెప్పాలి.

Asia Cup Super 4: IND vs SL Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News