ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు రాహుల్ పాదయాత్ర
దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు
కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంటే
ప్రధాని మోడీ, అమిత్‌షాలు భయపడుతున్నారు
దేశ ప్రజలపై బిజెపి దాడి చేస్తోంది
తెలంగాణలో 350 కి.మీ మేర సాగనున్న భారత్ జోడోయాత్ర
పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని
గద్దర్ చేసిన వినతిపై పార్టీ కమిటీని ఏర్పాటు చేసి చర్చిస్తుంది
ఢిల్లీ లిక్కర్ స్కాం ముందుకు వస్తోంది.. వెనక్కి వెళ్తోంది: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/హై-దరాబాద్: ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేందుకే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తున్నారని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా దేశ ప్రజల స్వేచ్ఛ కోసం రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారన్నారు. భారత్ జోడో యాత్ర మామూలు పాదయాత్ర కాదని ఆయన చెప్పారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పారు. బ్రిటీష్ పాలనలో చోటు చేసుకున్న పరిస్థితులే ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు. పాలకులు మారినా కూడా వారి ఆలోచన విధానం మారలేదని బిజెపిని రేవంత్ విమర్శించారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంటే ప్రధాని మోడీ, అమిత్ షాలు భయపడుతున్నారన్నారు. దేశ ప్రజలజై బిజెపి దాడి చేస్తోందని ఆరోపించారు. దేశానికి బిజెపి ప్రమాదకారిగా తయారైందని ఆయన అభిప్రాయపడ్డారు. భాషలు, ప్రాంతాలు, మతాలు, మనుషుల మధ్య బిజెపి నేతలు చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రజలను కాపాడేందుకు రాహుల్‌గాంధీ ఈ యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించేందుకు ఈ ఏడాది అక్టోబర్ 24న కర్ణాటకలోని రాయిచూర్ నియోజకవర్గం నుండి తెలంగాణలోకి రాహుల్‌గాంధీ పాదయాత్ర రానుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుందని చెప్పారు. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్ చెరు, మత్తంగి, సంగారెడ్డి, జోగిపేట, శంకరంపల్లి, మద్నూర్ మీదుగా నాందేడ్‌లోకి రాహుల్ పాదయాత్ర వెళ్లనుందని చెప్పారు. ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన తర్వాత మెదక్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుందని చెప్పారు. తెలంగాణలో 350 కి.మీ సాగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు వందలాది మందిగా ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రతి రోజూ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాహుల్‌గాంధీ వెంట ఉంటారని వివరించారు. న్యూఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని గద్దర్ చేసిన వినతిపై పార్టీ కమిటీని ఏర్పాటు చేసి చర్చిస్తుందని చెప్పారు. అంతేకాదు ఈ విషయమై పలు పార్టీలతో కూడా చర్చించనున్నట్లుగా తెలిపారు. అంతేకాదు, ఈ చర్చల సారాంశంపై నివేదికను సోనియాగాంధీకి అందిస్తామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ముందుకు వస్తోంది.. వెనక్కి వెళ్తోందన్నారు. 2014-22 మధ్య పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల ఆర్థికస్థితితులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy about Rahul Gandhi Padayatra