కీవ్: యూరప్‌లోనే అతిపెద్దదైన ఉక్రెయిన్ అణు కర్మాగారంపై దాడులు కొనసాగుతుండటంతో మంగళవారం ఆ ప్రాంతంలో నెలకొన్న భయాందోళనలు మరింత పెరిగాయి. ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్‌ను ధ్వంసం చేయడంతో భద్రతలో భాగంగా అణు కర్మాగారం స్వశక్తిపై ఆధారపడేలా చర్యలు తీసుకున్నారు. ప్రపంచ నేతలు పదే పదే అణుకర్మాగారం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి విధ్వంసం జరిగినా పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. అయినా ఆ ప్రాంతంలో బాంబు జరుగుతున్నాయి.
ఉక్రెయిన్ బలగాలే దాడులు చేస్తున్నాయని ఆ ప్రాంతంలో రష్యా నియమించిన అధికారులు మంగళవారం ఆరోపించారు. అయితే గంటల వ్యవధిలో స్పందించిన ఉక్రెయిన్ అధికారులు క్లెమ్లిన్ బలగాలే తరుచుగా దాడులుకు పాల్పడుతున్నాయని రష్యాఆరోపణలను తిప్పికొట్టారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆరంభంలోనే రష్యా బలగాలు ఈ ప్లాంట్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. అప్పటినుంచి ఇరుదేశాల బలగాలు పరస్పరం ఆరోపించుకుంటున్నా దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. ఈక్రమంలో విపత్కర పరిస్థితి తలెత్తడంతో గతవారం అంతర్జాతీయ ఆటమిక్ ఎనర్జీ బృందం ప్లాంట్‌ను సందర్శించి పరిస్థితిని అంచనా వేసింది. పరిశీలకులు తమ నివేదికను యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్‌కు అందజేయనున్నారు. మరో ఇద్దరు ప్లాంట్ వద్ద ఉండే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో పరిశీలకులు అందించే నివేదికపై ఉత్కంఠ నెలకొంది. కాగా రష్యా బలగాలు ప్లాంట్‌ను తమ అధీనంలోకి తీసుకున్నా ఉక్రెయిన్ కార్మికులే అణు కర్మాగారంలో పనిచేస్తున్నారు.