Tuesday, November 5, 2024

పాక్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం… హత్య

- Advertisement -
- Advertisement -

A minor girl was gang-raped in Pakistan

పంజాబ్ అసెంబ్లీ బయట బాధితురాలి కుటుంబీకుల ఆందోళన
తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి
నిందితులు ఇద్దరి అరెస్టు

లాహోర్ : పాకిస్థాన్ లోని లాహోర్ నగరంలో స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లిన 10 ఏళ్ల మైనర్ బాలికను స్విమ్మింగ్‌పూల్ యజమాని, అతని సన్నిహితులు అత్యాచారం చేయడమే కాక, హత్య చేసిన సంఘటన బయట పడింది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులతోపాటు భారీ ఎత్తున జనం పంజాబ్ అసెంబ్లీ బయట మంగళవారం నిరసన ప్రదర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పౌర సమాజం సభ్యులు, ఎన్‌జీవొలు ఈ నిరసనలో పాల్గొన్నారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నిరసన స్థలం వద్దకు సీనియర్ పోలీస్ అధికారులు చేరుకుని దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింప చేశారు. ఈ ఘోర సంఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. బాధితురాలు సుర్రన్ వ్యాలీ లోని మొహ్మద్ జిల్లా గిరిజన ప్రాంతం పాష్తూన్ కుటుంబానికి చెందింది. సెంట్రల్ లాహోర్ లోని మనవాన్ ప్రాంతంలో గల స్విమ్మింగ్‌పూల్‌కు తన సోదరునితో కలిసి వెళ్లింది. అయితే ఎఫ్‌ఐఆర్‌లో బాలిక తండ్రి తాజ్ ముహమ్మద్ ఫిర్యాదు ప్రకారం తన కుమారుడు సజ్జద్, తన కుమార్తె కలిసి మనవాన్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్‌కు గత వారం వెళ్లారని తెలిపారు. ఆ స్విమ్మింగ్ పూల్ యజమాని అలీ రజా.

స్విమ్మింగ్‌పూల్ నుంచి సజ్జద్ ఒక్కడే ఒంటరిగా తిరిగి ఇంటికి వచ్చాడని, తన సోదరి మాత్రం అదృశ్యమైందని చెప్పినట్టు తాజ్ ముహ్మద్ పేర్కొన్నారు. తాను తన కుటుంబీకులు స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లగా తన కుమార్తె స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి చనిపోయిందని రజా చెప్పాడని వివరించారు. రజా, అతని సన్నిహితులు కలసి తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారని, తరువాత హత్య చేశారని తాజ్ ముహమ్మద్ ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి షాబాజ్ అహ్మద్ దీనిపై మాట్లాడుతూ అనుమానితులు రజా, అస్లాంను అరెస్టు చేశామని తెలిపారు. పోస్టుమార్టమ్ నివేదికలో బాలిక అత్యాచారానికి, తరువాత హత్యకు గురైందని బయటపడినట్టు చెప్పారు. నిందితుడు అస్లాం తాము అత్యాచారం చేసిన తరువాత నీటిలో ముంచివేసి హత్యచేశామని అంగీకరించాడని పోలీస్ అధికారి చెప్పారు. ఈ సంఘటనను పంజాబ్ సిఎం పర్వేజ్ ఎలాహి తీవ్రంగా పరిగణించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఐజిపిని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News