టాప్‌లో అజిత్రోమైసిన్ … లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి ముందు, తర్వాత కూడా విచ్చలవిడిగా యాంటీ బయోటెక్స్‌ను వినియోగిస్తున్నారని దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఆగ్నేయాసియాలో ప్రాంతీయ ఆరోగ్యంపై లాన్సెట్ అధ్యయనం చేపట్టిన సందర్భంగా ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇందులో చాలా ఔషధాలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లేనివేనని పేర్కొంది. దేశంలో మొత్తం యాంటీబయోటెక్స్ వినియోగంలో 75 శాతం కేవలం 12 రకాల యాంటీబయోటిక్‌లే ఉన్నాయని, ఇందులో అజిత్రోమైసిన్ టాప్‌లో ఉండగా, రెండోస్థానంలో సెఫిక్జిమ్ ఉంది.
భారత్‌లో మొత్తం వెయ్యికి పైగా యాంటీబయోటిక్ ఫార్ములేషన్లు ఉండగా, 10,100 బ్రాండ్లు ఉన్నట్టు నివేదిక పేర్కొంది. అయితే ఇందులో చాలావరకు యాంటీబయోటిక్ బ్రాండ్లను కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు లేకుండానే విక్రయిస్తున్నట్టు తెలిపింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని తగ్గించేందుకు తక్షణ విధాన, నియంత్రణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా యాంటీబయోటిక్స్‌ను వినియోగించడం వల్ల రోగనిరోధక సామర్థం తగ్గే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది.