న్యూఢిల్లీ : కేంద్రం నుంచి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్షంతో విపక్షాలు ఐక్యం కావాలన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు తృణమూల్ అధినేత్రి , పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ గతం లోనే తన కుమార్తె కవిత, సీనియర్ నేత కే. కేశవరావుతో కలిసి కోల్‌కతా వెళ్లి మరీ మమతతో సమావేశమయ్యారు. విపక్షాల ఐక్య పోరు ప్రాధాన్యతను, బీజేపీయేతర పక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. దానికి నాడు మమత సానుకూలంగానే స్పందించారు. ఇప్పుడు నితీశ్ కూడా రంగం లోకి దిగడంతో ఆమె తన వైఖరిని పూర్తిగా వెల్లడించారు. అసలు ఆట పశ్చిమబెంగాల్ నుంచే ప్రారంభమౌతుందని, తాను నితీశ్, అఖిలేశ్ , హేమంత్ సొరేన్, ఇతర మిత్రులంతా చేతులు కలిపితే ఇక బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మమత ప్రశ్నించారు.
అసలు బీజేపీ ప్రభుత్వమే అవసరం లేదన్నారు. కోల్‌కతాలో గురువారం జరిగిన తృణమూల్ సభలో ఆమె మాట్లాడుతూ బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా భారత్ వచ్చినా కోల్‌కతా రాకుండా బీజేపీ అడ్డుకుందని మమత ఆరోపించారు. అంతటితో ఆగని ఆమె ఢిల్లీలో నేతాజీ విగ్రహావిష్కరణకు రావాలని సెక్రటరీతో లేఖ పంపారని , తానేమీ బీజేపీకి బానిసను కాదని మమత మండిపడ్డారు. రాజకీయం అంటేనే యుద్దరంగమని, తాము 34 ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల్లో విభేదాలను మీడియా గోరంతను కొండంతలుగా చూపుతుందని ఆరోపించారు. గతంలో తనకు అభిషేక్ బెనర్జీ మధ్య విభేదాలున్నాయని చూపారని, ఇలాంటి కధనాలతో టీఆర్‌పి పెరగదని ఆమె హితవు పలికారు. పశువుల స్మగ్లింగ్ కేసులో టీఎంసీ నేత అసుబ్రత మెండల్ అరెస్టును ప్రస్తావిసూ అసుబ్రత మొండల్ సాహసిగా జైలు నుంచి తిరిగి వస్తారని అన్నారు. బడా నేతలను అరెస్టు చేస్తే కార్యకర్తలు నిస్పృహకు లోనవుతారని వారనుకుంటున్నారని ఆరోపించారు.