Monday, January 13, 2025

ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’

- Advertisement -
- Advertisement -

 

సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని సమకూర్చి లక్షపాతిక వేల ఉద్యోగాలు కల్పించే లక్షంతో కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు ఈ మేరకు విధాన నిర్ణయం తీసుకొంది. ఐదేళ్లలో 300 రవాణా టెర్మినల్స్‌ను నిర్మించడం కోసం రైల్వే భూమిని సులభతర నిబంధనల మీద ప్రైవేటుకు అప్పగించడానికి ఈ నిర్ణయం వెలువడింది. ఇంత వరకు ఐదేళ్లుగా మాత్రమే వున్న లీజు సమయం ఇక ముందు 35 ఏళ్లు అవుతుంది.

లీజుకు తీసుకున్న వారి నుంచి వసూలు చేసే భూమి లైసెన్స్ రుసుము 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించారు. అంటే నామమాత్రపు రుసుముకే విలువైన రైల్వే భూమిని లీజుకు ఇవ్వదలచారన్నమాట. నీతిఆయోగ్ సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య అమితంగా పీడిస్తున్న మాట వాస్తవం. జనాభాలో అత్యధిక శాతంగా వున్న పని వయసులోని వారికి ఉద్యోగాల కల్పన అతి పెద్ద సవాలుగా మారింది. దీనికి పరిష్కారం సాధించడానికి యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాలు రచించి అమలు చేస్తున్న పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఉదాహరణకు ప్రధాన మంత్రి మోడీ అత్యంత ఆరాటంగా అమల్లోకి తెచ్చిన మేకిన్ ఇండియా ప్రాజెక్టు కింద విదేశీ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడతాయన్న అంచనా తల్లకిందులైంది. విదేశీ పెట్టుబడులు చైనా నుంచి ఇక్కడికి తరలి వచ్చేస్తాయని సాగిన ప్రచారం బూటకంగా నిరూపించుకున్నది.

అలాగే యుపిఎ పాలనలో అమల్లోకి తెచ్చిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఎస్‌ఇజెడ్) విధానం ఘోరంగా విఫలమైంది. పెట్టుబడులను ఆకట్టుకోడానికి, నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి తలపెట్టిన పథకాలు, ప్రాజెక్టులు మన దేశంలో కార్పొరేట్ పెట్టుబడిదార్ల సంపదను అపారంగా పెంచివేసే కార్యక్రమాలుగానే ముగిసిపోతున్నాయి. ఇందులో అందెవేసిన చేయి అనిపించుకుంటున్న ప్రధాని మోడీ ప్రభుత్వం మొత్తం భారతీయ రైల్వేనే ప్రైవేటుకు అప్పగించాలని సంకల్పించింది. ఇప్పటికే 151 రైళ్ల నిర్వహణకు ప్రైవేటు రంగం నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రవాణా టెర్మినల్స్ నిర్మించడానికి ప్రైవేటుకు రైల్వే భూములను అప్పగించాలన్న తాజా నిర్ణయమూ కార్పొరేట్ శక్తుల కొంగుబంగారం కానున్నదని భావించక తప్పదు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైలు మార్గ వ్యవస్థ.

దీని మొత్తం విలువ రూ. 1,17,380 కోట్లు (16.04 బిలియన్ డాలర్లు) అలాగే మన రైల్వేల వద్ద 4.77 లక్షల హెక్టార్ల భూమి వుందని సమాచారం. ఇంత భూమిని లీజు కింద చవకగా అప్పగిస్తామంటే వద్దనే వారుంటారా? ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహిత కార్పొరేట్ పెట్టుబడిదారు అదానీ వంటి వారు ఆలస్యం చేస్తారా? ప్రజల భూములను సేకరించి ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవాలనే యోచన బెడిసికొట్టి తీరుతుందని సెజ్‌ల విధానం నిరూపించింది. చైనాలో విజయవంతమైన ఈ విధానాన్ని కాపీ కొట్టి అమలు చేసి దెబ్బతిన్నాము. చైనాలోని షెన్‌జెన్‌లో 20 వేల హెక్టార్లలో అతిపెద్ద సెజ్ వెలసింది. అందులోనే రేవులు, విద్యుత్తు కేంద్రాలు, విమానాశ్రయాలు వంటివి వెలిసి అది లాభదాయకమైంది. 2005లో అప్పటి మన వాణిజ్యమంత్రి చైనాలోని ఈ సెజ్‌ను సందర్శించి అదే విధానాన్ని మన దేశంలో అమలు చేయించారు. ఈ జోన్ల ద్వారా రూ. 25 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా మొత్తం రూ. లక్ష కోట్ల ప్రైవేటు పెట్టుబడి వస్తుందని ఆశించారు.

ఈ సెజ్‌లకు పన్ను చెల్లింపు నుంచి మినహాయించారు. రాష్ట్రాలు అతి తక్కువ రేటుకు, కొన్ని చోట్ల ఉచితంగానూ విద్యుత్తును సరఫరా చేశాయి. అయినా అవి వ్యవసాయ రంగాన్ని కుదింప చేసి ప్రైవేటుకు భూమిని ధారాదత్తం చేయించాయి. చైనాలోని సెజ్‌లు ప్రభుత్వాధీనంలో వుంటాయి. ప్రైవేటు రంగం అందులో పెట్టుబడులు పెట్టి లాభసాటిగా నడిపిస్తుంది. ఇందుకు విరుద్ధంగా ఇండియాలో సెజ్‌లను మొత్తంగా ప్రైవేటు ఆధీనం చేస్తారు. హర్యానాలో రైతుల వద్ద నుంచి 3.5 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేసి రిలయన్స్ ఇండియా లిమిటెడ్‌కు కట్టబెట్టిన భూమి విలువ 85 బిలియన్ రూపాయలకు చేరుకున్నదని ఒక సమాచారం. కాకులను కొట్టి గద్దలకు వేయడానికే ఇటువంటి పథకాలూ, ప్రయోగాలు దారితీస్తున్నాయని స్పష్టపడడం లేదా! ప్రధాని మోడీ ప్రభుత్వం తెర లేపిన రైల్వే భూముల లీజు పథకం కూడా ప్రైవేటుకు బంగారు గుడ్ల బాతుగానే వినియోగపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News