Monday, December 23, 2024

తెలంగాణ వైతాళికుడు కాళోజీ: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Kaloji jayanthi

వరంగల్: పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు కాళోజీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ – హన్మకొండ లోని ఆయన విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.   కాళోజీ నారాయణరావు, కాళోజీగా, కాళన్న”గా సుపరిచితులు అని,  కాళోజీ తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమ ప్రతిధ్వని తెలిపారు. తెలంగాణ వైతాళికుడు కాళోజి అని,  ఆనాడు నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా కలం ఎత్తాడని ప్రశంసించారు.  స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు అని,  కాళోజీ 1914 సెప్టెంబరు 9న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారని, అతని తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు అని కొనియాడారు.

 కాళోజీ తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడని,  కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడని ప్రశంసించారు.  బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడిందని,  కాళోజీ ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం విద్యాబ్యాసం కొనసాగిందని,  అటు తరువాత సిటీ కాలేజీలోనూ, హన్మకొండలోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారని తెలియజేశారు.

1939లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాలనుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారని, 1930 నుంచే కాళోజీ  గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారని,  తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష అని, సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి,  జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని,  విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించిన ధైర్యవంతుడిని ప్రశంసించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరని మెచ్చుకున్నారు.

రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను అతని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారన్నారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు కాళోజీ నగర బహిష్కరణకు గురయ్యారని, స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర చాలా విలువైనదని ఎర్రబెల్లి ప్రశంసించారు.  1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారని,  1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారని,  కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని,  భారత ప్రభుత్వం అత్యున్నత  పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించిందని గుర్తు చేశారు. “సామాన్యుడే నా దేవుడు” అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచారని, కాళోజీ మరణానంతరం అతని పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారని,  కాళోజీ జన్మదినాన్ని సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా గౌరవిస్తున్నామని దయాకర్ రావు పేర్కొన్నారు.

  ప్రతి ఏటా ప్రముఖ కవులను గుర్తించి కాళోజీ అవార్డులతో గౌరవిస్తుందని, సిఎం కెసిఆర్ వరంగల్ లో ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీ కి కాళోజీ పేరు పెట్టారని,  అలాగే హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం పేరిట ఆడిటోరియంను నిర్మిస్తున్నామని,  కాళోజీ ప్రజా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉంటుందని ఎర్రబెల్లి చెప్పారు. కాళోజీ ఆశ‌యాల‌కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పాల‌న సాగుతుందని, కాళోజీ, జ‌య‌శంక‌ర్ సార్లు వ‌రంగ‌ల్ బిడ్డ‌లు కావడం ఈ ప్రాంత‌ ప్ర‌జ‌ల అదృష్టమన్నారు. కాళోజీ అందించిన స్ఫూర్తితోనే తాను రాజ‌కీయంగా ఎదిగానని వివరించారు. కాళోజీ, జ‌య‌శంక‌ర్‌లు పుట్టిన గ‌డ్డ అభివృద్దికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌ ఇస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్ర‌కాష్‌, ఎమ్మెల్యే ఒడితెల సతీష్ బాబు, డిసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కుడా చైర్మన్ సుందర్ రాజ్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌ జిల్లాల క‌లెక్ట‌ర్లు బి.గోపి, రాజీవ్‌గాంధీ హ‌న్మంతు, కాళోజీ శిష్యులు, ఉద్యోగ సంఘాల నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News