సాయం కాదు అమ్మకాలని వివరణ
వాషింగ్టన్ : అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం పాకిస్థాన్‌కు 450 మిలియన్ డాలర్ల విలువైన ఎఫ్ 16 జెట్ యుద్ధ విమానాల సాధనాసంపత్తిని సమకూరుస్తుంది. ట్రంప్ హయాంలో పాకిస్థాన్‌కు భద్రతాపరమైన సహాయాన్ని నిలిపివేశారు. దీనికి భిన్నంగా ఇప్పుడు బైడెన్ అధికారిక వ్యవస్థ నిర్ణయం తీసుకుంది. అయితే ఎఫ్ 16 పరికరాలను పాకిస్థాన్‌కు సాయంగా ఇవ్వడం లేదని, వీటిని ఆ దేశానికి విక్రయిస్తున్నామని అమెరికా ఉన్నత స్థాయి దౌత్యవేత్త డోనాల్డ్ లూ తెలిపారు. అయితే ఈ సాధనసంపత్తితో పాకిస్థాన్ తన ఎఫ్ 16 యుద్ధ విమానాల శ్రేణిని మరింత మెరుగుపర్చుకుంటుంది. ఇప్పటివరకూ పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్ 16 ఫైటర్లకు కేవలం స్పేర్‌పార్ట్‌లు అందిస్తున్నామని, వీటిని అమెరికా ప్రభుత్వం తరఫున సాయంగా భావించరాదని అమెరికా దౌత్యవేత్త తెలిపారు. గతంలో ఎఫ్ 16 విమానాల సరఫరా మేరకు సమకూర్చినందున సంబంధిత నిబంధనల మేరకే ఇప్పుడు విడిభాగాలను అందిస్తున్నట్లు దక్షిణాసియా, మధ్య ఆసియా వ్యవహారాల సంబంధిత అమెరికా సహాయ విదేశాంగ మంత్రి కూడా అయిన డోనాల్డ్ లూ స్పష్టం చేశారు.