2 నుంచి 3 శాతం మందిలోనే ఈ లక్షణాలు
లండన్ క్వీన్ మేరీ వర్శిటీ పరిశోధకుల అధ్యయనం
లండన్ : మంకీపాక్స్ వల్ల శరీరంపై దద్దుర్లు, ఫ్లూవంటి లక్షణాలు కనిపించడం సర్వసాధారణం. కానీ చాలా తక్కువ మందిలో అంటే 2 నుంచి 3 శాతం మందిలో మెదడువాపు వంటి వ్యాధితోపాటు నరాలకు హాని, మానసిక వైకల్యం కూడా సంభవించవచ్చని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో వెలువడిన తాజా అధ్యయనం వెల్లడించింది. లండన్ క్వీన్ మేరీ యూనివర్శిటీకి చెందిన అకడమిక్ ఫౌండేషన్ డాక్టర్ జేమ్స్ బ్రంటన్ బడెనోచ్ ఈ అధ్యయనం గురించి వివరించారు. 16 దేశాలకు చెందిన మంకీపాక్స్ బాధితులు 500 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. మెదడువాపు కానీ లేదా మెదడు పట్టేసినట్టు నిర్బంధంగా ఉండడం కానీ ఈ కేసుల్లో కనిపించక పోయినా, వీరిలో నాలుగోవంతు కన్నా ఎక్కువ మందిలో తలనొప్పి, అలసట వంటి మంకీపాక్స్ సాధారణ లక్షణాలు కనిపించాయి. పదిమందిలో ఒకరికి కుంగుబాటు లక్షణాలు బయటపడ్డాయి. అయితే స్పెయిన్‌లో మెదడువాపుతో ఉన్న మంకీపాక్స్ కేసులు రెండు బయటపడ్డాయి. మంకీపాక్స్ కేసులన్నిటిలో మెదడువాపు, మానసిక సమస్యలు కనబడడం లేదు కానీ చాలా స్వల్ప సంఖ్యలో ఈ లక్షణాలు బయటపడడంతో దీనిపై మరింత అధ్యయనం జరగాలని పరిశోధకులు చెబుతున్నారు.