స్పష్టంగా కనిపించక సందర్శకుల నిస్పృహ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇండియాగేట్‌ను రైసినా హిల్ కాంప్లెక్సు నుంచి విస్తరించి, కర్తవ్య పథ్‌గా పేరు మార్చి, అందంగా తీర్చిదిద్దినప్పటికీ అక్కడ ఇదివరకుండే యుద్ధ స్మారక అమర్ జవాన్ జ్యోతి లేకపోవడం సందర్శకులకు నిరాశ కలిగిస్తోంది. పచ్చిక బయళ్లతో చక్కగా ఈ మార్గాన్ని విస్తరించిన తరువాత రెండేళ్లకు శుక్రవారం నుంచి ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు. గురువారం ఈ మార్గాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. 2019లో నిర్మాణం ప్రారంభించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఇండియా గేట్‌ను విస్తరించారు. ప్రజలు ఈ కర్తవ్యపథ్‌ను సందర్శించి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకోవచ్చని ప్రోత్సహించారు. దీంతో సందర్శకులు రావడం ప్రారంభమైంది. అయితే కొందరు సెల్ఫీలతో ఇన్‌స్టాగ్రామ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ మరికొందరు మాత్రం ఈ స్మారక స్థూపం దగ్గర చలనం లేకుండా అదేపనిగా చూస్తూ ఉండిపోయారు. ఎన్ని అందాలు తీర్చిదిద్దినా అక్కడ అమర్‌జవాన్ జ్యోతి లేకపోవడం పెద్ద లోటుగా వారి నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. అమర్‌జవాన్ జ్యోతి అన్నది శాశ్వతమైన జ్వాల.
వంగిన తుపాకీ బోనెట్‌తో సైనిక శిరస్త్రాణం చిహ్నాలతో కనిపించేంది. 1971లో భారత్ పాక్ యుద్ధంలో భారత్ విజయానికి సంకేతంగా దీన్ని నెలకొల్పారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీన్ని ఆవిష్కరించారు. అయితే ఈ అమర్ జవాన్ జ్యోతిని ఈ ఏడాది జనవరి 21న అక్కడ నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఉన్న అమరజ్యోతితో విలీనం చేశారు. దీనిపై నిపుణులు, మాజీ సైనికులు భిన్నాభిప్రాయాలతో ఆందోళన వెలిబుచ్చారు. దాదాపు ఏభై ఏళ్లుగా ఈ అమర్ జవాన్ జ్యోతిని సందర్శిస్తూ అనుభూతిని పొందే వారికి ఇప్పుడు ఆ జ్యోతి లేకపోవడం వేదన కలిగిస్తోంది. ఇండియా గేట్‌కు ఘన చరిత్ర ఉంది. 191418 మొదటి ప్రపంచ యుద్ధం, 1919 నాటి ఆంగ్లో అఫ్గాన్ యుద్ధంలో అమరులైన 80,000 మంది భారత సైనికుల త్యాగాలకు చిహ్నంగా 1931లో దీన్ని ఆవిష్కరించారు. ఈ ఇండియా గేట్‌పై 13,516 మంది అమరవీరుల పేర్లు కూడా చెక్కి ఉన్నాయి.