Saturday, November 23, 2024

దసరాకు జాతీయ పార్టీ?

- Advertisement -
- Advertisement -

ముహూర్తం దాదాపుగా

విజయదశమినాడు సిఎం కెసిఆర్ ప్రకటించే అవకాశం జాతీయ
పార్టీ కోసం వివిధ పేర్ల పరిశీలన రాజకీయంగా
జిల్లాలో భారీ బహిరంగ సభ బిజెపియేతర సిఎంలకు ఆహ్వానం
కెసిఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లోకి రంగ ప్రవేశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముహూర్తం దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై దసరా పండుగు రోజున ఆయనే స్వయంగా అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఆ రోజున రాష్ట్రంలో తనకు రాజకీయంగా బాగా అచ్చొచ్చిన జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వెల్లడిస్తారని అధికార టిఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా ప్ర చారం సాగుతోంది. ఈ సభకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు, బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ లోగా రాష్ట్రంలో చక్కపెట్టాల్సిన అతి ప్రధానమైన అంశాలను ఆయన శరవేగంగా పూర్తి చేయనున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. తదనంతరం పూర్తిగా జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించనున్నా రు.

ఈ మేరకు అవసరమైన కసరత్తు, తగు కార్యచరణ ప్రణాళికను కూడా రూపొందించే ప్రక్రియలో కెసిఆర్ నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మేధావులు, పదవి విరమణ చేసిన వివిధ శాఖలకు చెందిన అధికారులు, రాజకీయ ఉద్దండులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిచ్చే సూచనలు, సలహాలను సేకరిస్తున్నారు. వాటిన్నింటిని సమగ్రంగా క్రోడీకరించి…దేశ ప్రజలకు మేలు చేసేవిధంగా పదునైన ఎజండాతో ఢిల్లీ కదనరంగంలో దూకాలని కెసిఆర్ భావిస్తున్నారు. దీని వెనుక అనేక మంది కెసిఆర్‌కు సహాయ, సహకారాలను అంగీకారం తెలిపారని తెలుస్తోంది. జాతీ య స్థాయిలో ఏర్పాటు చేయబోయే పార్టీకి భారత్ రాజ్య సమితి, జై భారత్ పార్టీ, నవ భారత్ పార్టీ, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) తదితర పేర్లను సిఎం కెసిఆర్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు.

ఏర్పా టు చేయబోయే పార్టీలో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు కూడా పూర్తయినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో స్థాపించబోయే పార్టీకి టిఆర్‌ఎస్ కారు గుర్తే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు కోసం ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఒకరికి ఢిల్లీలో బాధ్యతలు కట్టబెట్టారని సమాచారం. పార్టీపై కెసిఆర్ ప్రకటన వెలువడిన వెనువెంటనే సదరు నాయకుడు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయనున్నారు. కాగా ఈ పరిణామాలన్నీ వడివడిగా జరుగుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి కెసిఆర్ అడుగుపెట్టే అంశంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేంద్రంలోని బిజెపి పాలన విధానాలపై, ప్రధాని నరేంద్ర మోడీపై కొంతకాలంగా సిఎం కెసిఆర్ విమర్శలు చేస్తున్నారు.

అదే సమయంలో బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన వంతుగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ పాలనపై సంబంధిత సిఎంలు సైతం గుర్రుగా ఉన్నారు. దీంతో బిజెపికి వ్యతిరేకంగా కెసిఆర్ నేతృత్వంలో జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించేందుకు వారు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో సాధ్యమైనంత త్వరగా అడుగుపెట్టాలన్న నిర్ణయానికి సిఎం కెసిఆర్ వచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పలు బహిరంగ సభల్లోనూ త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు కెసిఆర్ స్వయంగా వెల్లడించారు.

అయితే ఆ ప్రకటన ఎప్పుడు అనే అంశంపై ఇప్పటి వరకు కెసిఆర్ తగు స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంలో మరింత ఆలస్యం చేయడం మంచిది కాదని వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు కెసిఆర్ ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెల్లడించనున్నారని వినిపిస్తోంది. కాగాజాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయంలో కూడా కెసిఆర్ ఏ క్షణంలోనైనా తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని టిఆర్‌ఎస్ వర్గాలు సైతం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాయి.

ఒకటి, రెండు రోజుల్లోనే కెసిఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఏర్పాటుపై సూచన ప్రాయంగా వెల్లడించే అవకాశముందని ఘంటా పథంగా చెబుతున్నారు. కాగా సోమవారం 11వ తేదీన హైదరాబాద్‌కు కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి వస్తున్నారు. ఆయనను ప్రగతి భవన్‌కు రావాల్సిందిగా కెసిఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. కెసిఆర్ ఆహ్వానం మేరకు నేడు ప్రగతి భవన్‌లో వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మరోసారి జాతీయ రాజకీయాలపై వారిద్దరు చర్చించనున్నారు. తదనంతరం కెసిఆర్ మరికొన్ని రాష్ట్రాల్లో పర్యటించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి జాతీయ రాజకీయాలతో చర్చించి, వారి ఆమోదంతో జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పార్టీని ప్రకటించిఆ తరువాత ఫ్రంట్‌లు , పొత్తుల అంశం పైనిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News