Monday, December 23, 2024

‘పీయూష్ జీ’ ఇప్పుడేమంటావ్? నూకలు తింటావా?

- Advertisement -
- Advertisement -
ఎగుమతులు నిషేధించారుగా.. వాటినే తింటారేమో!

నాలుగేళ్లకు సరిపడా బియ్యం
నిల్వలు ఉన్నాయన్నారు కదా?
ఇప్పుడొచ్చిన కొరతకు
కారణమేంటి? ఎగుమతులపై
20% సుంకాన్ని ఎందుకు
విధించారు తెలంగాణను విఫల
రాష్ట్రంగా చూపించాలనుకున్నారు
మోడీ సర్కార్ తీసుకున్న గోతిలో
తానే పడింది కేంద్రం అసంబద్ధ
విధానాలతోనే ప్రస్తుతం ఆహార
ధాన్యాల కొరత రాష్ట్రంపై వివక్ష
పూరిత ఆలోచనలతో వరి
ధాన్యాన్ని కొనకపోవడం వల్లే
ఈ దుస్థితి ఇప్పటికైనా ‘ఒకే
దేశం- ఒకే సేకరణ’ విధానాన్ని
అనుసరించాలి తెలంగాణలో
పండిన పుట్లకొద్దీ ధాన్యాన్ని
కొనకుండా ఆహార భద్రతను
పణంగా పెట్టారు కేంద్రం వరిని
అడ్డుకోవడం వల్లే దేశంలో
12 నుంచి 15 మిలియన్
టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గే
అవకాశం : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను దేశానికి విఫల రాష్ట్రంగా చూపించాలనుకున్న మోడీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. నాలుగేండ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరునెలల కింద గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికే గోధుము లు, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన మోడీ సర్కార్, తాజాగా నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సిఐ గోడౌన్లతో పాటు వివిధ కేంద్రాల దగ్గర బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీ గా తగ్గడంతోనే మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని వ్యా ఖ్యానించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని నెలల కిందట తాము విజ్ఞప్తి చేస్తే, దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత కొరతకు కారణమేంటో చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజల అవసరాలపై కనీస అవగాహన లేకపోవడం, ఆహార ధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానమంటూ లేకపోవడమేనని శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

ప్రమాదం ముంచుకొస్తోంది

తెలంగాణ రైతులు, రాష్ట్రంపై మోడీ సర్కార్ కు ఉన్న వివక్షతోనే దేశంలో ఆహార ధాన్యాల కొరత తలెత్తే ప్రమాదం ముంచుకొస్తుందని కెటిఆర్ అన్నారు. దేశ ప్రజల ఆహార అవసరాలపై మోడీ సర్కార్ కు దీర్ఘకాలిక ప్రణాళిక కరువైందన్న సంగతి ప్రస్తుత సంక్షోభంతో తేలిపోయిందన్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమంపై కనీస అవగాహన, ఆలోచన, ప్రణాళిక లేని మందబుద్ది బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉండడం ప్రజల దురదృష్టమని ఆయన విమర్శించారు.

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ

నీళ్ల విషయంలో అరిగోస పడ్డ తెలంగాణ రైతాంగ దశ మార్చడానికి ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంతో శ్రమకోర్చి సాగునీటి ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేశారని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రధానంగా రైతంగానికి ఉచిత కరెంటు, రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలతో రాష్ట్రంలో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. పుట్ల కొద్దీ ధాన్యం పండించి దేశానికే అన్నం పెట్టే స్థాయికి అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందన్నారు.

వరి వేయకుండా అడ్డుకున్నది కేంద్రమే

యాసంగిలో బాయిల్ రైస్ తీసుకోమంటు మోడీ సర్కార్ కొర్రీలు పెట్టడంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కెటిఆర్ పేర్కొన్నారు. రైతులను వరి వెయ్యనియ్యకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కెటిఆర్ ఆరోపించారు. ఫలితంగా గత వానకాలం సీజన్‌తో పోల్చితే ఈసారి సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో ఇది కోటి ఎకరాలు దాటే అవకాశం కూడా ఉందన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 12-15 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. అందుకే బియ్యం ఎగుమతులను కేంద్రం నియంత్రించిందన్నారు.

మోడీ ప్రభుత్వానికి ఒక విధానం లేదు

దేశానికి ఒక సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యమే అని కెటిఆర్ విమర్శించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఆహార భద్రత లేని పరిస్థితిలో ఉండటం బిజెపి ప్రభుత్వ హ్రస్వ దృష్టిని సూచిస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకొని ప్రజల సంక్షేమం, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. దేశ వ్యవసాయ రంగం, ఆహార అవసరాలపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలన్నారు. ఇందుకోసం వన్ నేషన్… వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణ విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని అమలుచేయకుండా దేశ రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.

ఆహార కొరత ముంగిట్లో భారత్

పండిన ధాన్యాన్ని సేకరించకుండా కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ రోజు ఆహార కొరత ముంగిట్లో దేశం నిలిచిందని కెటిఆర్ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి ఎలాంటి వివక్షకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. భారీగా ధాన్యం పండిస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయి ధాన్యాన్ని సేకరించి దేశ ప్రజల ఆహార భద్రతను ధోకా లేకుండా చూడాలని ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌కు కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News