యూపీ అటవీ శాఖ మంత్రి కుడా పచ్చదనం చూసి అబ్బురపడ్డారు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత
త్యాగధనుల స్ఫూర్తితో అడవులను పరిరక్షిద్దాం
అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
అటవీ అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు, సీఎం లు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రతినిదులు పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ.. .. కితాబునిస్తున్నారని అటవీ పర్యావణ శాఖ మంత్రి. ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిన్న తెలంగాణలో పర్యటించిన ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ … హరితహారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులు బాగున్నాయని అభినందించారని తెలిపారు. అడవులను, వణ్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీశాఖ సిబ్బంది కనబరిచిన త్యాగాలకు విలువ కట్టలేమని అటవీ శాఖ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమరులకు ఘనంగా నివాళులర్పించారు.
అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్, ఎం. డొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అటవీ శాఖ సలహాదారు ఆర్.శోభ, రిటైర్డ్ పీసీసీఎఫ్ లు పీ. మల్లిఖార్జున్ రావు, మునీంద్ర, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నెహ్రూ జూలాజికల్ పార్కు వద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ… 1984వ సంవత్సరము నుండి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 21 మంది అటవీ అధికారులు ధైర్య సాహసాలతో, అంకిత భావంతో పని చేస్తూ అటవీ సంపదను కాపాడటంలో తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారన్నారు.
ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారని తెలిపారు. వన్యప్రాణుల, స్మగ్లర్లు అడవుల్లో ఉన్నప్పటికీ, భూ ఆక్రమణదారులు దాడులు జరుపుతున్నప్పటికీ భయపడకుండా, అన్నింటినీ ఛాలెంజ్‌గా తీసుకుని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అటవీ అధికారులు, సిబ్బంది పనిచేస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రకృతి వనరులను కాపాడటం, వన్యప్రాణుల సంరక్షణకు వారు ఎంతో శ్రమిస్తున్నారని, ఈ క్రమంలో ఎంతో మంది అటవీశాఖ ఉద్యోగులు, సిబ్బంది తమ ప్రాణాలను సైతం కొల్పోయారు. వారందరికీ అటవీ శాఖ తరపున నివాళులర్పిస్తున్నానని ప్రకటించారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇప్పటికే అటవీ సంపదను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు.
ఈ సందర్భంగా అటవీశాఖ పనితీరును మంత్రి వివరించారు
2021- 2022వ సంవత్సరంలో అటవీ అధికారులు అటవీ రక్షణలో భాగంగా మొత్తం 11,669 కేసులను నమోదు చేసి, రూ.14.07 కోట్ల జరిమానాను విధించారు. రూ. 7.31 కోట్ల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. 1634 వాహనాలను జప్తు చేశారు. 1133 అటవీ భూ ఆక్రమణ కేసులు నమోదు చేశారు.
ఇక అటవీ శాఖను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. ఈ సంవత్సరం 92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు (FSO’s) 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (FROs), 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల (FBO’s) ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతేకాకుండా అటవీ అధికారులు, సిబ్బందికి 2173 వాహనాలను అందజేసింది.
జంగిల్ బచావో – జంగిల్ బడావో నినాదం ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణతో పాటు క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కొరకు ప్రజల భాగస్వామ్యంతో పెద్ధ ఎత్తున చర్యలు తీసుకొంటున్నాము.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి మార్గనిర్దశనం మేరకు పోలీస్ శాఖ సహకారంతో అడవుల రక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టడం కోసం అనేక సమగ్ర చర్యలు ప్రారంభించబడ్డాయి.
అడవుల రక్షణతో పాటు తాగునీటి కోసం వన్యప్రాణులు జనారణ్యంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. శాఖాహార జంతువుల కోసం గడ్డి క్షేత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము.
•అడవి సరిహద్దులు సరి చూసుకొని పెంపుడు జంతువులు, పశువులను నియంత్రించే కందకాలను 10,732 కి.మీ పొడవున త్రవ్వి దీనిపై గచ్చకాయ మొక్కలు నాటుట ద్వారా అడవి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాము.
•ప్రపంచంలోనే పచ్చదనం పెంపుదలలో మూడవ అది పెద్ద మానవ ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “తెలంగాణకు హరితహార పథకం” ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 268.75 కోట్లకు పైగా మొక్కలను నాటాము.
•ప్రతి గ్రామ పంచాయితీలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నాము.
i) తెలంగాణకు హరితహారం (2021-22) పథకంలో భాగంగా ఇప్పటి వరకు 14,965 నర్సరీలను ఏర్పాటు చేయగా, దీనిలో గ్రామ పంచాయతీలలో 12,769 నర్సరీలు, మున్సిపాలిటీలలో 1002 నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది.
ii) రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించుటకు క్షీణించిన అడవులలో అటవీ పునరుద్ధరణ పనులను జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది.
•నూతన పంచాయతీ, మున్సిపల్ చట్టాల ద్వారా నాటిన మొక్కలను సంరక్షించు కునేందుకు కఠినమైన నిబంధనలు పొందుపరిచడం జరిగింది. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను ఖచ్చితంగా సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాము.
అడవుల రక్షణ, పచ్చదనం పెంపు కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటూనే.. మనం ప్రతీ ఏటా అటవీ అమరవీరులను స్మరించుకుంటున్నాము. స్మరణతోనే సరిపెట్టకుండా అడవుల సంరక్షణకు తృణప్రాయంగా వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారనే విషయం మరిచిపోవద్దు.
వీరి కుటుంబ సభ్యులకు అటవీ శాఖ అండగా నిలబడాలి. ఎవరైనా సిబ్బంది విధి నిర్వహణలో మరణిస్తే… వారి కుటుంబ సభ్యులను పరామర్శలతో సరిపెట్టకుండా, బాధిత కుటుంబానికి న్యాయపరమైన లబ్ధి చేకూరే విధంగా అటవీ శాఖ అధికారులు, సంఘాలు బాధ్యతను భుజానికెత్తుకోవాలి. దీనికి ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. అదే మనం అమరవీరులకు ఇచ్చే సరైన గౌరవం, అసలైన నివాళి అవుతుంది. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రకృతి ప్రసాదించిన వన సంపదను రేపటి మన భవిష్యత్తు, భావి తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
• మన దేశంలో, రాష్ట్రంలో అడవుల రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన ఆ ధన్య జీవులను పేరు పేరున స్మరించుకుంటూ, వారి ప్రాణ త్యాగాలకు జోహార్లు అర్పిస్తున్నాను.