హైదరాబాద్: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు జాతీయ వన్యప్రాణుల బోర్డు అనుమతులు అడ్డంకిగా మారడంతో పనులు ముందుకు సాగడం లేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అసవరమైతే ఢిల్లీ వెళ్ళి త్వరితగతిన అటవీ అనుమతులు వచ్చేలా సంబంధిత అధికారులతో చర్చిస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు నిర్ధేశించిన అటవీ చట్టాలకు విఘాతం కలగకుండా గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా దశల్లో ఉన్న రోడ్ల అనుమతులు, పురోగతిపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించారు. బుధవారం అరణ్యభవన్‌లో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయా నియోజకవర్గాల్లో రహదారుల నిర్మాణానికి సంబంధించిన అటవీ అనుమతులపై చర్చించారు. ఏజెన్సీలోని రహదారులు లేని గ్రామాలకు రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, పర్యావరణ పరిరక్షణకు నిర్ధేశించిన అటవీ చట్టాలకు విఘాతం కలగకుండా గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అటవీ ప్రాంతంలో రోడ్లను నిర్మించేందుకు ఇంజనీరింగ్ శాఖల అధికారులు చేసే ప్రతిపాదనల దశలోనే అటవీ శాఖ అధికారులతో సంప్రదించాలని స్పష్టం చేశారు. అటవీ శాఖ అభ్యంతరాలపై కూలంకషంగా చర్చించి వీటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. అటవీ శాఖ అనుమతులు అవసరమైన రహదారుల అనుమతుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా అనుమతులు పొందేందుకు అధికారులు కృషి చేయాలని చెప్పారు. మరోవైపు అటవీ అనుమతులు విషయంలో తమకు స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేలు మంత్రి, అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. మారుమాలూ గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్య పరంగా గిరిజనులు ముఖ్యంగా గర్భిణులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటవీ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని మంత్రిని కోరారు. అయితే రాష్ట్ర వన్యప్రాణుల బోర్డ్ అనుమతులు లభించినప్పటికీ.. నేషనల్ వైల్డ్ బోర్డ్ లో తీవ్ర జాప్యం జరుగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. సరియైన వైద్యం అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అవసరమైతే ఢిల్లీ వెళ్ళి.. ఎంపీల సహయంతో నేషనల్ వైల్డ్ లైఫ్ అధికారులను కలిసి అటవీ అనుమతులపై చర్చిద్దామని ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోణప్ప, విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, దివాకర్ రావు, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, పీసీసీఎఫ్ (ప్రొడక్షన్) ఎం.సీ పర్గెయిన్, తదితరులు పాల్గొన్నారు.