మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాలపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు మరిన్ని పంచాయతీరాజ్ రోడ్లు, డ్రైనేజీలు, సిసి రోడ్డు ఇవ్వాలని వారు కోరారు. తన నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో అవసరమైన నిధుల విషయం మంత్రి ఎర్రబెల్లి దృష్టికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీసుకొచ్చారు. ఈ మేరకు మంత్రికి విజ్ఞపన పత్రాన్ని అందచేశారు. ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరం గల్ జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పరిస్థితులు, అవసరాలను వివరించారు. ఇద్దరు మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించి సానుకూలంగా స్పందించారు.