రూ.200కోట్ల విలువచేసే హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇండియన్ కోస్ట్‌గార్డు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఆరుగురు పాకిస్థానీయులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.200కోట్ల విలువచేసే 40కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని సీనియర్ ఎటిఎస్ తెలిపారు. పాకిస్థాన్ ఫిషింగ్ బోటులో హెరాయిన్ తరలిస్తుండగా గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరప్రాంతంలో పట్టుకున్నామన్నారు. బోటులో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. గుజరాత్‌తీరం నుంచి హెరాయిన్‌ను రోడ్డుమార్గంలో పంజాబ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం అందడంతో అప్రమత్తమయ్యామన్నారు. పాకిస్థాన్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఫిషింగ్ బోటుపై నిఘా ఉంచి 40కేజీల హెరాయిన్, ఆరుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా గతంలోనూ గుజరాత్ తీరంనుంచి భారత్‌లోకి డ్రగ్స్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన విదేశీయులను పట్టుకున్న గుజరాత్ ఎటిఎస్, కోస్ట్‌గార్డు భారీ ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.