ముఖ్యమంత్రికి ఆర్.కృష్ణయ్య వినతి
హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్సిటీలలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా స్థాపించిన 6 ప్రైవేటు యూనివర్సిటీలతో పాటు 2020లో స్థాపించిన 5 యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్దమని, అన్యాయమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ప్రైవేటు యూనివర్సిటీలు గతంలో ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసి, ఎంబిఎ, ఎంసిఎ, బిఇడి కోర్సులు నిర్వహించాయని తెలిపారు.
మాల్లారెడ్డి గ్రూప్ విద్యాసంస్థల్లో 40 వరకు ఇంజనీరింగ్ ఇతర కాలేజీలు, అనురాగ్ గ్రూప్ విద్యా సంస్థలో 25 వరకు ఇంజనీరింగ్, ఇతర కాలేజీలు, ఎస్‌ఆర్ యూనివర్సిటీలో 20 వరకు కాలేజీలు ఉన్నాయని, ఈ కాలేజీలు ప్రారంభమైనప్పటి నుండి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని అయితే ఈ సంస్థలు యూనివర్సిటీలుగా రూపాంతరం చెందగానే రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్లు అమలు చేయబోమని అంటే ఎలా అని కృష్ణయ్య ప్రశ్నించారు. 2006లో పార్లమెంటులో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంటులో చట్టం చేశారని, ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దమే నని 2007లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. 1980లో ప్రేవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేశారని గుర్తు చేశారు. ఎస్‌సిలకు 15 శాతం, ఎస్‌టిలకు 6 శాతం, బిసిలకు 29 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.