Friday, January 3, 2025

మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్
చికిత్స కోసం దేశవిదేశాల నుంచి రోగులు ఇక్కడికి వస్తున్నారు
వైద్యరంగంలో కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం అవసరం
కేర్ ఆసుపత్రిలో హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టమ్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్ మారుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. చికిత్స కోసం దేశవిదేశాల నుంచి ఎంతో మంది రోగులు నగరానికి వస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగర వాతావరణం బాగుండటం, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. చెన్నై నీటి సమస్య, బెంగుళూరులో ట్రాఫిక్ సమస్య, ముంబయిలో కాలుష్యం సమస్య ఉందని, హైదరాబాద్ నగరంలో ఏ సమస్య లేని కారణంగా ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం రోగులు వస్తున్నారని అన్నారు.ఐటీ రంగంలో మనం ఎలాగ మేటిగా ఉన్నామో.. వైద్యంలో కూడా అలా అవుతామని పేర్కొన్నారు. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో గురువారం హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టమ్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బండ ప్రకాశ్, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, ఎంఎల్‌సి ప్రభాకర్, ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని అన్నారు. కొత్త టెక్నాలజీ ద్వారా శస్త్ర చికిత్స మరింత సులువుగా మారుతుందని, తద్వారా పేషెంట్ త్వరగా కోలుకుంటున్నారని అన్నారు.దాంతో రోగులు ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గి, వారికి బిల్లు తగ్గుతుందని చెప్పారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సతో పాటు తక్కువ ఖర్చుతో చికిత్స అందించాలని సూచించారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు మాత్రమే చేయాలని కోరారు.
ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మూడు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. అవయవా మార్పడి చికత్సలకు ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుందని చెప్పారు. కేర్ ఆసుపత్రి కూడా ఆరోగ్య శ్రీ కేసులు బాగా తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహకరిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెంచుతున్నామని చెప్పారు. 33 జిల్లాలు మెడికల్ కాలజీలు తీసుకువస్తున్నామని, ఇప్పటికే 17 కాలేజీలు ఏర్పాటయ్యాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మినస్ట్రేషన్, శానిటేషన్‌ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్లు 800 ఉంటే, వాటిని 2,840కు పెంచామని చెప్పారు. అలాగే 233 పిజి సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఐటీ ఉద్యోగులు తెలంగాణ బిడ్డలే ఉంటున్నారని,వైద్యరంగంలో కూడా అలాగే చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ.11,440 కోట్లు హెల్త్ కోసం బడ్జెట్ పెట్టుకున్నామని అన్నారు.
సి సెక్షన్ మరింత తగ్గాలి
రాష్ట్రంలో సాధారణ డెవివరీలు పెరగాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సి సెక్షన్‌లు మరింత తగ్గాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీ చేస్తే రూ.3 వేలు ప్రోత్సాహకం ఇస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిలో 70 నుంచి 75 శాతం వరకు సి సెక్షన్లు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మారాలని అన్నారు. సి సెక్షన్ల నిర్వహణపై ఆడిట్ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క సి సెక్షన్స్ లో తప్ప, అన్ని రంగాల్లో ముందుందని, ఇది మారాలని అన్నారు. కేర్ హాస్పిటల్స్ ప్రసూతి గైనకాలజీ విభాగం అధిపతి పద్మ శ్రీ డాక్టర్ మంజుల అనగాని మాట్లాడుతూ.. రోబోటిక్ సర్జరీలతో రోగులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. చిన్న కోత, సర్జరీ అనంతరం నొప్పి తక్కువగా ఉండటంతోపాటు రక్తస్రావ తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి గ్రూప్ చీఫ్ అఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.వి.ఎస్. గోపాల్, యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ పి. వంశీ కృష్ణ, ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నీలేష్ గుప్తా ఇతర వైద్యలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Hyderabad to become Medical Tourism Hub: Harish Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News