Monday, December 23, 2024

చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

BJP in self-defense in Maharashtra

బిజెపి, సంఘ పరివార్ విద్వేష రాజకీయాల నేపథ్యంలో గత కొంతకాలంగా ఒక కొత్త పల్లవి మొదలుపెట్టారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బిజెపి పాలకులూ, నాయకులు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్రోద్యమ పోరాటంలో రాష్ట్రీయ స్వయం సేవక్ దాని అనుబంధ సంస్థలు పాల్గొనలేదనేది చరిత్ర చెప్పే సత్యం. మరి, కనీసం హైదరాబాద్ (రాజ్య) సంస్థానంలో నాటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌గాని, దాని రాజకీయరూపం భారతీయ జనసంఘ్ పార్టీ వాళ్ళు ఎవరూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన లేదు. అయినప్పటికీ హైదరాబాద్ విమోచన అంటూ నెత్తిన నోరు పెట్టుకొని అదేదో తమ ఘన కార్యం అన్నట్టు వీధిలో పడి ప్రచారం చేస్తున్నారు. పైగా ఈ అంశాన్ని హిందూ ముస్లింల మధ్య పోరాటంగా వక్రీకరించే కార్యక్రమంగా బిజెపి, పరివార్ సంస్థలు మొదలు పెట్టాయి. ఆ మేరకు జాతి విద్వేష ప్రచారంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సామరస్య జీవన విధానానికి అగ్గిముట్టించే పనిలో పడ్డారు. మత విద్వేష రాజకీయాల ద్వారా ప్రజల్లో చీలిక తెచ్చి, తెలంగాణ గడ్డమీద పాగా వేయడానికి బిజెపి ఉవ్విళ్లూరుతున్నది. కుట్రపూరితమైన అధికార ధ్యాసతో నాటి తెలంగాణ ప్రజల సాయు ధ పోరాటాన్ని హిందూ ముస్లిం ప్రజల అంశంగా సృష్టించే వక్రీకరణనలకి పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో అధికార పీఠం ఎక్కడానికి అడ్డగోలు చరిత్ర వక్రీకరణకు పూనుకున్నారు.తెలంగాణ విమోచన వారోత్సవాల పేరిట బిజెపి పరివారం మొదలుపెట్టిన మేళాలో కొమరం భీమ్, చిట్యాల ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంకా ఇలాంటి ఎందరో చారిత్రక వ్యక్తులకు టెంకాయలు కొట్టి, పూలదండలు వేసే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్రీయ స్వయం సేవక్, బిజెపి శ్రేణులకు వారి అధినాయకత్వం ఆదేశాలు ఇచ్చింది.అయితే ఆయా వ్యక్తులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని రాజకీయ రూపం అయిన భారతీయ జనతా పార్టీతో ఏ సంబంధం లేని వాళ్ళు కావడం గమనార్హం. కనీసం ఆ భావజాలం ఉన్న నాయకులు కూడా కాదు. చిట్యాల ఐలమ్మ అవిభక్త భారత కమ్యూనిస్టు పార్టీ మద్దతుదారు. హైదరాబాద్ సంస్థానంలోని , ఫ్యూడల్ పాలన విధానాలని ఎదిరించిన ధీర వనిత. ఆమె ముగ్గురు కుమారులు కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు.

కొమురం భీమ్, స్వతంత్ర గోండు రాజ్యం కోసం పోరాడిన వీరుడు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ హైదరాబాద్ రాజ్యంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన బాధితుల పక్షాన న్యాయవాది, పోరాటవాది. నిజాం ప్రభువు మీద బాంబు దాడికి ప్రయత్నించిన నారాయణరావు పవార్‌తో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ మీద కూడా ఆనాడు కేసు బనాయించడం జరిగింది.ఇలా తమ పార్టీతో సంస్థలతో కాని సంబంధంలేని వ్యక్తుల ఆదర్శాన్ని, ధీరత్వాన్ని అవకాశవాదంతో సొంతం చేసుకునే కార్యక్రమాన్ని బిజెపి చేపట్టింది. సెప్టెంబర్ 17 వారోత్సవాలలో భాగంగా హైదరాబాద్ రాజ్యంలో, వెట్టి చాకిరికీ దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూమి కోసం భుక్తి కోసం సాగిన మహోజ్వల పోరాటం అది. ఆ పోరాటాన్ని తెలంగాణలో తమ మలిన రాజకీయాలకు బిజెపి వాడుకోచూస్తున్నది. విద్వేష మత రాజకీయాలతో, సామరస్య పూర్వక తెలంగాణ ప్రజా జీవనాన్ని నాశనం చేయడానికి ‘హైదరాబాద్ విమోచన’ పేరిట నాటకీయ రాజకీయాలకి పాల్పడటం జరుగుతున్నది.

ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి విద్వేష రాజకీయ చదరంగంలో తమ భావాలతో పొసగని విరుద్ధ భావజాలం కలిగిన చారిత్రక నాయకులు, పోరాట యోధులకు కాషాయం జెండా కప్పి, తమ స్వాతంత్య్ర పోరాట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రణాళిక వేసుకున్నారు. తద్వారా తెలంగాణలో అందలం ఎక్కాలని తాపత్రయ పడుతున్నారు. అమరవీరుల రక్త తర్పణాన్ని తమ సొంతానికి ఆపాదించుకొని దేశభక్తులుగా చలామణి కావాలని ప్రయత్నిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్ సంస్థానం లేదా హైదరాబాద్ స్టేట్ భారత్‌లో భాగం కాదు. అప్పటికి 225 సంవత్సరాలుగా స్వతంత్ర రాజ్యంగా మనుగడలో ఉంది.

 

నాటి హైదరాబాదు రాజ్యంలో ఇప్పటి తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని మరి కొన్ని జిల్లాలతో కలిసి హైదరాబాద్ స్టేట్ గా ఉన్నది. 1947 ఆగస్టు 15 తేదీన స్వాతంత్య్రం రావడానికి ముందు, 1946లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానంలో ఫ్యూడల్ వ్యతిరేక సాయుధ రైతంగా పోరాటం ఆరంభమైంది.
దేశ స్వాతంత్య్రానికి పూర్వమే, తెలంగాణలో ఆంధ్ర మహాసభ ఉద్యమం మొదలయినది. తదనంతర కాలంలో దొరల ఫ్యూడల్, భూస్వామ్య వ్యతిరేక, సాయుధ పోరాటంగా మారింది. కుల మతాలకు అతీతంగా ఫ్యూడల్ పాలనా విధానాల మీద వీరోచిత పోరాటం జరిగింది. ఆ పోరాటంలో లక్షలాది మంది ప్రజలు చిత్ర హింసలకు గురి అయ్యారు.

రజాకారు మూకల, దొరల గుండాలు, నిజాం పోలీసుల చేతిలో 1500 మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, నాయకులూ ప్రాణాలు కోల్పోయారు. అయితే 1948 సెప్టెంబర్‌లో ఆపరేషన్ పోలో పేర హైదరాబాద్ సంస్థానంలో భారత సైన్యాలు విరుచుకుపడ్డాయి. ఆ దాడుల్లో 2500 మంది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సాధారణ ప్రజలు మరణించడం జరిగింది. భారత సైన్యం అజ్ఞాతంలో ఉన్న కమ్యూనిస్టు పోరాటయోధుల ఆచూకీ చెప్పాలని లక్షలాదిమంది తెలంగాణ ప్రజలను తీవ్ర చిత్రహింసలకి గురి చేయడమూ జరిగింది. దేశ సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధం చేయాల్సిన భారత సైన్యం, ఫ్యూడల్ రాచరిక వ్యవస్థకు, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మట్టి మనుషుల మీద అనాగరిక యుద్ధానికి పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిజాం, దొరల ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా – ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న జర్నలిస్టు షోయబుల్లాఖాన్‌ని దారుణంగా హత్య చేయడం జరిగింది. అదే విధంగా, తన భూమికి సంబంధించి వివాదంలో, షేక్ బందగి అనే ముస్లిం రైతు విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి, రజాకార్ల చేతుల్లో హత్యకు గురయ్యాడు.

వేలాది మంది ముస్లింలు సైతం హైదరాబాద్ సంస్థానంలో అణచివేతకు గురయ్యారు. కమ్యూనిస్టు నాయకుడు, రచయిత, కవి మగ్దూం మోహియోద్దీన్ నిజాం పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎందరో ముస్లింలు నాటి నిజాం రాజ్యహింసకు గురయ్యారు. ఇలాంటి పోరాట పరిస్థితులలో నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ విధిలేక హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసే పరిణామం ఏర్పడింది.
వాస్తవాలు ఇలా ఉంటే, సర్దార్ పటేల్ వల్లనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో చేరడం సాధ్యమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ చౌకబారు సూత్రీకరణకు పాల్పడుతున్నది. మత రాజకీయాల పేరుతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిందని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని మత కోణంలో చిత్రిస్తున్నారు. ఈ కుటిల రాజకీయాలను, కుతంత్రాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. నిలువెల్లా ముస్లిం వ్యతిరేక ప్రచారం చేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను దేవదేవుడిగా చిత్రించే ఈ పరివారం, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను, సర్దార్ పటేల్ గారే 1956 అక్టోబర్ 31వ తేదీ వరకు రాజ్ ప్రముఖుగా కొనసాగించారు.

రాజ్ ప్రముఖ్ అంటే ఇప్పటి గవర్నర్ లాంటివాడని అర్థం. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు నష్టపరిహారాలు, రాజాభరణాలు ఇచ్చే ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు, ఆ రోజుల్లోనే ఆయన రాజ్ ప్రముఖ్ పదవిలో ఉన్నందుకు, సంవత్సరానికి 50 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. పరివార్ వర్గాలు, బిజెపి చెబుతున్నట్లు హైదరాబాద్ సంస్థానం సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల మాత్రమే భారత యూనియన్‌లో విలీనం కాలేదు. అలా జరగడానికి వేలాది మంది కమ్యూనిస్టు వీరుల ప్రాణత్యాగం, లక్షలాది మంది ప్రజల పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది. వాస్తవ చరిత్ర ఇలా ఉంటే, సంఘ్ పరివార్ శక్తులు, బిజెపిలు తమ అధికార పీఠం కోసం, మత విద్వేష రాజకీయాలను, దేశసరిహద్దుల్లో పొరుగు దేశాల నుంచి ప్రమాదం ఉందనే కపట ప్రచారంతో భావావేశాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం జరుగుతోంది. చరిత్రను వక్రీకరించడంలో సంఘ్ పరివార్ దాని రాజకీయ రూపం బిజెపి కల్పనలు, అవాస్తవాలతో ప్రజలను గందరగోళపరచాలని చూస్తున్నది.

తమ రాజకీయ భావజాలంతో ఏమాత్రం సంబంధం లేని చారిత్రక ప్రముఖ వ్యక్తులకు దండలు వేస్తూ దండాలు పెడుతూ తమ విద్వేష రాజకీయాలకు ఆయా ప్రముఖులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ క్రమంలో భారత స్వాతంత్య్ర పోరాటం మొదలుకొని వివిధ రాష్ట్రాలలో జరిగిన ప్రజా పోరాటాలను కూడా తమ ఖాతాలో వేసుకునే కుట్రలకు తెరలేపింది. సంఘ్ పరివార్ శ్రేణులు గాంధీని హత్య చేసిన గాడ్సేని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మరో వైపు ప్రధానమంత్రి మోడీ, బిజెపి నాయకులు గాంధీకి పూల దండలు వేసి వంగి వంగి దండాలు పెట్టడం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బిజెపి ఆధ్వర్యం గాంధీ మేళాలు నిర్వహించటం ద్వారా కొమురం భీమ్ సాగించిన నిజాం వ్యతిరేక పోరాటాన్ని, అలాగే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని తమ సొంతం చేసుకొని వాళ్ల పోరాటాలకు తమ ముద్ర వేసుకోవాలని ఆరాట పడుతున్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఫ్యూడల్ వ్యతిరేక, దోపిడీ వ్యతిరేక, ప్రజా పోరాటాల్లో ఇసుమంతైన పాత్రలేని సంఘపరివార్, బిజెపి నాయకులు చరిత్ర వక్రీకరణకు పాల్పడుతున్నారు.భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరపున భారతదేశ స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పట్టుమని పది మంది సభ్యులు కూడా పాల్గొనలేదు. కాగా ఆ పోరాటంలో పాల్గొన్న ఒకరిద్దరు నాయకుల్లో ఒకరు బ్రిటిష్ పోలీస్ అధికారులకు అప్రూవర్ గా మారిపోయి శిక్ష తప్పించుకోగా సాటి సహచరులకి శిక్షలు పడ్డాయి.

అదే విధంగా వివిధ వర్గాల ప్రజల మనోభావాలతో ప్రాంతానికి ఒక తీరుగా రాజకీయ క్రీడలు ఆడుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో గో మాంసం సాకుతో దాడులు జరుగుతుండగా, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలలో అదే మాంసాన్ని నాణ్యంగా అమ్మిస్తామని ప్రచారం చేయడం విదితమే. దిగంబర నాగ సాధువులను, జైన దిగంబరులను స్వాగతించే భిన్న భారతీయ సంస్కృతిలో, మరో వైపు కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం మహిళల హిజాబ్ ధారణని సమస్యగా చిత్రించడం బిజెపి సంఘపరివార్ ద్వంద్వ రాజకీయ ప్రమాణాలకు నిదర్శనం. భిన్న మతాలు, తెగల సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో ప్రతి అంశాన్ని మతం చిచ్చులోకి లాగడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు, అంతరించిన అనాగరిక ఫ్యూడల్ బానిస పాలనా విధానాల్ని ప్రవేశపెట్టే వ్యూహంతో సంఘ్ పరివార్ శక్తులూ బిజెపి పాలకులు దేశంలో అలజడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో స్వాతంత్య్రోద్యమ పోరాటంలో, ప్రగతిశీల సంస్కరణ ఉద్యమాలలో కానీ ఏ చరిత్ర లేని వాళ్ళు, చరిత్ర వక్రీకరణకు పాల్పడుతున్నారు.

తమ విధానాలతో ఏ విధమైన భావజాల సారుప్యతలేని చారిత్రక పాత్రలను, వ్యక్తులని సొంతం చేసుకున్నట్టు నటిస్తూ విద్వేషం సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం జరిగి, 75 సంవత్సరాలు అవుతున్నా ప్రజల జీవనం విధానంలో గొప్ప మార్పేమీ లేదు. ఈ సందర్భంగా, కులమత విద్వేష కుటిల రాజకీయాలను తిప్పి కొట్టాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది. మెరుగైన జీవన స్థాయి కోసం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ఇపుడు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉంది. అందుకు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధం కావాలి.

జూలకంటి రంగారెడ్డి
(సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు)
9490098349

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News