Monday, January 20, 2025

మత విద్వేశాలు రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Addressing the Gathering in Sircilla

సిరిసిల్ల: సంక్షేమానికి ట్రేడ్ మార్కుగా తెలంగాణ నిలుస్తోందని, పలువురి త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కులం,మతం పేరిట విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాలని ఐటి,పురపాలక, పట్టణాభివృధ్ధి, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్లలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. జై తెలంగాణ నినాదంతో మంత్రి కెటిఆర్ తన ప్రసంగం ప్రారంభించారు. ప్రజలు మతపిచ్చి, వైషమ్యాల మాయలో పడితే దశాబ్దాల వెనుకబాటుకు వెళతామన్నారు. అందరూ సమైక్యంగా ఉండాలనే సమైక్యతా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా కలిసి మెలిసి ఉంటున్న తెలంగాణ ప్రజల మధ్య కులం, మతం పేరుతో రకరకాల చిచ్చు పెట్టాలని చూసేవారిని ప్రజలు ఒక కంట కనిపెట్టి ఉండాలన్నారు. అందరం కలిసి ఉంటేనే తెలంగాణలో ఇన్ని సంక్షేమ, అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామన్నారు. హిందూ, ముస్లింలు అంటూ పిచ్చిమాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడే చిల్లర మల్లర నాయకులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి పనికివచ్చే ఒక్క పథకం ఇవ్వని కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాల తరువాత సెప్టెంబర్ 17ను గుర్తించడం ఏమిటన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సిఎంలు వచ్చి మాట్లాడి వెళ్లారని వారి వల్ల తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. రేపు ( సెప్టెంబర్ 17 న) తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలంగాణ నుండి రూపాయి తీసుకుని 46 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం నుండి అమిత్ షా 10 వేల కోట్ల రూపాయలు తీసుకురావచ్చు? కదా! అని కెటిఆర్ అమిత్‌షాను నిలదీశారు. ఒక్క కాలేజి కూడా తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదని, ఎనిమిదేళ్లుగా సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను అడుగుతున్నా కేంద్రం ఇవ్వటం లేదని విమర్శించారు. రేపు హైదరాబాద్‌కు వచ్చి అమిత్ షా నిజాంను తిట్టడం, హిందుత్వం గూర్చి మాట్లాడం తప్ప ఏం చేస్తారో చూద్దామని మంత్రి కెటిఆర్ అన్నారు. ఓట్ల కోసమే అమిత్ షా రాష్ట్ర పర్యటన అన్నారు. పాత పుండ్లు, గాయాలు కెలికి పంచాయతీ పెట్టడం కాకుండా అందరం కలిసి ఉందామని, గతంలోకి చూస్తే ఏమి రాదని, భవిష్యత్తు గూర్చి ఆలోచించి పిల్లలకు ఉద్యోగాలు వారి భవిత గురించి ఆలోచిస్తే అందరికి లాభం కలుగుతుందన్నారు. భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఐక్యం చేసిన రోజును గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. నిజాం కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలను తన తాత సిరిసిల్లజిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకకు చెందిన జోగినిపెల్లి కేశవరావు తనకు బాల్యంలో అనేక పర్యాయాలు వివరించారన్నారు.

తన తాత కేశవరావును 1980లో ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తించి 2000 సంవత్సరం వరకు పెన్షన్ ఇచ్చిందని ఆతరువాత తమ అమ్మమ్మకు ఆ పెన్షన్ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదని 1948లో నిజాం ప్రభువు రాచరికంపైన మొదటిసారిగా, 1956లో బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపితే ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ ఉద్యమం రెండో పర్యాయం, 1968లో తెలంగాణ సాధన కోసం గొంతెత్తి 378 మంది ప్రాణాలు బలిపెట్టి 3వ దశ తెలంగాణ ఉద్యమం చేపట్టారన్నారు. 2001లో సిఎం కెసిఆర్ నాయకత్వంలో నాలుగో పర్యాయం 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ బిడ్డలకు ఉగ్గుపాలతోనే పోరాట పటిమను నేర్పారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే రాష్ట్ర శాసన సభ తీర్మాణం అవసరం లేకుండానే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధ్యపడిందన్నారు. అంబేద్కర్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించారని అంబేద్కర్ గురించి భవిష్యత్తు తరాలకు తెలవాలనే సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. సంక్షేమం, అభివృధ్ధి అందరికీ అందాలని సిఎం కెసిఆర్ పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త గ్రామపంచాయతీలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణలో 2013లో 29 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందేవని అందులో కొందరికి 200 రూపాయలు, వికలాంగులకు మాత్రం 500 రూపాయలు అందేవన్నారు. ఇందుకోసం 800 కోట్ల రూపాయలను కేటాయించేవారన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని కొందరికి 2 వేల రూపాయలు, వికలాంగులకు 3 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. ఇందుకోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. సిరిసిల్ల జిల్లాలో గతంలో 1,07,000 మందికి పెన్షన్లు ఇవ్వగా అదనంగా మరో 17 వేల మందికి కలిపి ఇప్పుడు 1,24,000 మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. సిరిసిల్ల జిల్లాలో 1,50,000 కుటుంబాలుండగా అందులో 90 శాతం మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుండి వారికి పెన్షన్లు రాకపోతే వారికి కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత తనదే అని మంత్రి వేదికపైనుండి హమీ ఇచ్చారు. గత 8 సంవత్సరాల్లో 62 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 58 వేల కోట్ల రూపాయల రైతు బీమా ఇచ్చిన రైతు ధీమా ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. నేతన్నలకు రైతు బీమా మాదిరిగా 5 లక్షల రూపాయల బీమా పథకం ప్రవేశపెట్టిన ఘనత దేశంలో తెలంగాణకే దక్కిందన్నారు.

కరెంట్, నీటి సమస్యలు తీరాయన్నారు. సంక్షేమ పథకాలు చక్కగా అమలు అవుతున్నాయన్నారు. ప్రజల కడుపు నొప్పి తెలుసుకుని,పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే ముఖ్యమంత్రి కెసిఆర్ మనకున్నాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎర్రటి ఎండల్లో చెరువులు, ప్రాజెక్టులు మత్తల్లు దుంకుతున్నాయన్నారు. సిరిసిల్లజిల్లాలోని కోనరావుపేట, వీర్నపల్లి మండలాలకు త్వరలోనే ప్యాకేజి 9 ద్వారా నీరు అందుతుందన్నారు. అడగకుండానే అనేక పథకాలు అమలు చేస్తున్న సంస్కారవంతమైన ప్రభుత్వం తమదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినిపెల్లి వినోద్‌కుమార్, పవర్‌లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్‌పి చైర్‌పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ కళ, రైతు బంధు అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, తెరాస జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్‌పి సిఇఓ గౌతం రెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఆర్‌డిఓ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకు మందు సిరిసిల్లలో భారీ ర్యాలీ నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News