పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకావిష్కరణ
ఆదివాసీ, బంజారా భవనాలకు ప్రారంభోత్సవం
నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్‌టిఆర్ స్టేడియం వరకు సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శన
శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలలో భాగంగా శనివారం ఉదయం పదిన్నర గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నగరంలోని పబ్లిక్‌గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే నగరంలో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవ భవనం, సేవాలాల్ బంజార ఆత్మగౌరవ భవనాలను సంబంధిత మంత్రులతో కలిసి సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. అనంతరం నెక్లస్ రోడ్డు నుంచి లోయర్‌ట్యాంక్ బండ్ చౌరస్తా వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం మీదుగా దోమల్‌గుడాలోని ఎన్‌టిఆర్ స్టేడియం వరకు ఆదివాసి, గిరిజన కళారూపాలతో భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. దీనికి పలువురు మంత్రులు నేతృత్వం వహించనున్నారు. కాగా సాయంత్రం ఐదు గంటలకు ఎన్‌టిఆర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా సమైక్యతా దినోత్సవేడుల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల కార్యాలయాలపై ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జాతీయ పతాకావిష్కరణలు చేస్తా రు. ఈ మేరకు అన్ని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలకు సంబంధించిన భారీ కటౌట్లను టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. కాగా సిఎం కెసిఆర్ నగరంలోని హాజరుకానున్న వేడుకలకు సంబంధించి అనేక రహాదారులను త్రివర్ణ పతాకాలతో శోభాయమానం చేశారు. అలాగే సిఎం కెసిఆర్ ఘనస్వాగతం పలుకుతూ పెద్దఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలను నెలకొల్పారు. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం(సెప్టెంబర్ 18) అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు చేస్తారు. అలాగే కవులు కళాకారులను ఘనంగా సత్కరించనున్నారు. ఘనంగా తెలంగాణ స్పూర్తిని చాటేలా పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ముగియనున్నాయి.
సర్వం సిద్ధం : సిఎస్
శనివారం నిర్వహించే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభ వేదిక అన్ని ఏర్పాట్ల చేశామని వెల్లడించారు. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగే ర్యాలీలో భారీ సంఖ్యలో సాంస్కృతిక కళా బృందాలు పాల్గొంటున్నాయని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ విశేషాలను తెలిపే ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఆదివాసీ ల గుస్సాడీ నృత్యాలు, గోండు, లంబాడీ తదితర 30 ర కాల కళారూపాలను ప్రదర్శించే కళాకారులు ర్యాలీలో పాల్గొంటారని, ర్యాలీలో పాల్గొంటున్న కళాకారులకు, సభలో పాల్గొనే వారందరికి తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బారికేడింగ్‌లు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, ని రంతర విద్యుత్ సరఫరా, తగు రవాణా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఈ సమవేశంలో జిఎడి కార్యదర్శి శేషాద్రి, ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Telangana Integration Day Celebrations at Public garden