హైదరాబాద్‌లో క్రికెట్ సందడి
నిమిషాల్లోనే అమ్ముడు పోయిన టికెట్లు
ఆస్ట్రేలియాభారత్ పోరుకు ఉప్పల్ సిద్ధం!
మన తెలంగాణ/హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నెల 25న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాభారత్ జట్ల మధ్య టి20 మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ఇదే కావడంతో ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొవిడ్ కారణంగా మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లకు కూడా ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వలేదు. కానీ ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఉప్పల్ స్టేడియం ఓ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అంతేగాక ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లుగా పేరున్న ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య పోరు కావడంతో మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత నెలకొంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావిస్తున్న అభిమానులకు టికెట్లు దొరక్క పోవడం ఇబ్బందికర పరిణామంగా మారింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను విక్రయించగా అవి నిమిషాల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. దీంతో టికెట్ల కోసం ప్రయత్నించిన వేలాది మంది అభిమానులకు నిరాశే మిగిలింది. గతంలో స్టేడియంలో లేదా కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను విక్రయించే వారు. దీనికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ సంఘం అధికారులు విస్త్రృతంగా ప్రచారం కూడా చేసేవారు.
కానీ ఈసారి అలాంటి ప్రచారాలు ఏమీ కనిపించలేదు. చాలా మంది టికెట్ల అమ్మకాలకు సంబంధించిన సరైన సమాచారం లభించలేదు. టికెట్లు ఎక్కడ అమ్ముతున్నారనే దానిపై తగినంత సమాచారం లేక పోవడంతో అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. తాజాగా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడు పోయాయని తెలుసుకున్న అభిమానులు ఎంతో బాధకు గురవుతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్‌లో ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మ్యాచ్ టికెట్లను దక్కించుకున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన మ్యాచ్‌కు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. తమ అభిమానల జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది క్రికెట్ ప్రేమీకులు ఆసక్తికతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్‌ను సజావుగా నిర్వహించేందుకు హెచ్‌సిఎ పటిష్ట చర్యలు చేపట్టింది.
IND vs AUS T20 Match on Oct 25th in Hyderabad