పుణే: చట్టసభలలో మహిళా రిజర్వేషన్ల కల్పనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని ఎన్‌సిపి నేత శరద్ పవార్ చెప్పారు. ప్రత్యేకించి ఉత్తర భారతం, అన్నింటికంటే ప్రధానంగా పార్లమెంట్ వైఖరి మహిళా కోటాకు వ్యతిరేకంగా ఉందన్నారు. పుణే డాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమం నేపథ్యంలో పవార్‌ను ఆయన కూతురు, ఎంపి సుప్రియా సూలేను వార్తా సంస్థలు ఇంటర్వూ చేశాయి. 33శాతం కోటా విషయంపై పవార్ స్పందించారు. మహిళా కోటా గురించి తాను కాంగ్రెస్ ఎంపిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ వస్తున్నానని తెలిపారు. ప్రజల మానసికతను ఈ బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో నిర్థారించుకోవల్సి ఉంటుందన్నారు. ఉత్తరభారతదేశపు వైఖరి మహిళా కోటాకు వ్యతిరేకంగా ఉందని పవార్ తన రాజకీయ అనుభవం నేపథ్యంలో తెలిపారు. తాను పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు కూడా బిల్లు గురించి మాట్లాడినప్పుడు చివరికి పార్టీ ఎంపిలు లేచి నిలబడటం, బయటకు వెళ్లడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే అన్ని పార్టీల ఏకాభిప్రాయం అవసరం అని, తాను మహారాష్ట్ర సిఎంగా ఉన్నప్పుడు జడ్‌పి, పంచాయతీ సమితిలలో మహిళలకు రిజర్వేషన్ల గురించి బిల్లు ప్రవేశపెట్టినట్లు, తొలుత దీనిపై వ్యతిరేకత వ్యక్తం అయినా తరువాత అంతా దీనిని ఆమోదించారని వివరించారు. పార్లమెంటులోనూ ఈ అంశంపై ఇది జరిగితీరాలని సూచించారు.
Parliament still not conducive for Women’s Quota: Sharad Pawar