కష్టాలు ఫరారు ..లక్కీ బంపర్
తిరువనంతపురం : కేరళలో ఓ ఆటోడ్రైవర్‌కు రూ 25 కోట్ల లాటరీ తగిలింది. ఎంతో కాలం నుంచి ఆటోనడుపుతూ ఉన్నా దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదనేతీరులో బతుకు ఉండటంతో ఇటీవలే ఆయన మలేసియాకు చెఫ్‌గా వెళ్లాలనుకున్నాడు. అయితే ఆయన కష్టాలను దూరం చేస్తూ ఆదివారం బంపర్ లాటరీ విజేత అయ్యాడు. ఒక్కరోజు క్రితమే ఈ శ్రీవరాహం వాసి అయిన అనూప్ పెట్టుకున్న రూ 3 లక్షల రుణదరఖాస్తు కూడా మంజూరు అయింది. రోజు తిరగకుండానే ఈ ఆటోవాలా పాతిక కోట్ల ఆసామీ అయ్యాడు. శనివారమే అనూప్ టిజె 750605 నెంబరుగల టికెటు కొన్నాడు, మరుసటి రోజు వచ్చిన ఫలితం ఆయన రూటు మార్చింది. తాను లాటరీ టిక్కెట్లు కొనడం ఇదే తొలిసారి కాదని , ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు కొన్నానని ఆనందంతో తెలిపారు. ముందు ఓ టికెట్ తీసుకుందామనుకుని పరిశీలించానని, ఎందుకో నెంబరునచ్చకపోవడంతో ఇంకోటి ఎంచుకున్నానని లాటరీ ఏజెన్సీ వద్దనే తెలిపారు.
ఈ ఎంపిక ఆయన మలుపు తిప్పింది. మలేసియా ట్రిప్పు గురించి చెపుతూ మలేసియాకు వెళ్లడానికి రుణానికి వెళ్లిన బ్యాంకు వాళ్లకు తనకు రుణం అవసరం లేదని చెప్పానని, మలేసియాకు ఇప్పుడు వెళ్లడం లేదని వివరించారు. గత 22 ఏళ్లుగా లాటరీలు కొంటున్నానని, వంద నుంచి రూ 5000 వరకూ లాటరీ టికెట్లు కొన్నానని చెప్పారు. లాటరీ తన వంటి వాడికి వస్తుందా అనుకునే వాడినని, అందుకే రిజల్ట్ చూడకపొయ్యేవాడినని, అయితే ఎందుకో ఇప్పుడు తన ఫోన్‌లో ఈ టికెట్ తగిలిందని తెలిసిందని , వెంటనే తన భార్యకు చూపించి , అవునని నిర్థారించుకున్నానని ఆటోవాలా తెలిపారు. పన్నుల మినహాయింపు తరువాత అనూప్ రూ 15 కోట్ల వరకూ చేజిక్కించుకుంటాడు. ముందు ఓ ఇల్లు కొంటానని, అప్పులు తీర్చివేస్తానని , కష్టాలలో ఉన్న తమ బంధువులకు ఎంతో కొంత సాయం చేస్తానని తెలిపారు. కేరళలోనే చిన్నపాటి హోటల్ పెడుతానని చెప్పారు. గత ఏడాది కేరళలోని మరదుకు చెందిన ఆటోడ్రైవర్ జయపాలన్ పిఆర్‌కులాటరీలో రూ 12 కోట్లు దక్కాయి. ఇప్పుడు ఆదివారం లాటరీ లక్కీ డ్రాను రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ గోర్కి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్వహించారు.