Friday, December 20, 2024

అట్టుడుకిన చండీగఢ్ వర్శిటీ

- Advertisement -
- Advertisement -

విద్యార్థినుల అభ్యంతరకర వీడియోల లీక్
ప్రచారంపై దుమారం కొట్టిపడేసిన వర్శిటీ
వర్గాలు అదుపులోకి ఓ విద్యార్థిని

చండీగఢ్ : పంజాబ్‌లోని ప్రైవేటు యూనివర్శిటీలో కలకలం రేగింది. ఓ విద్యార్థిని తన సహచరుల ప్రైవేట్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిందనే ఆరోపణలపై మొహాలీలోని చండీగఢ్ యూనివర్శిటీ శనివారంనాడు రాత్రి అట్టుడికింది. విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేరే యూనివర్శిటీకి చెందిన స్నేహితుడికి ఆమె పంపిందని, వాటిని అతడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడన్న వార్త దావానలంలా వ్యాపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ విషయం బయటకు తెలియడంతో మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించినట్టు వార్తలు రావడంతో దుమారం రేగింది. అయితే ఈ వార్తలను పోలీసులు, యూనివర్శిటీ వర్గాలు ఖండించాయి. అవన్నీ అవాస్తవాలని కొట్టిపడేశారు. ఒక విద్యార్థి తన సొంత వీడియో క్లిప్‌ను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆ విద్యార్థిని అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని డిఎస్‌పి రూపిందర్ కౌర్ తెలిపారు.

విద్యార్థిని బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ఓ బృందాన్ని సిమ్లాకు పంపినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో విద్యార్ధిని ఇంకెవరి వీడియోలు రికార్డు చేయలేదని తేలిందని ఏడిజిపి గురుప్రీత్ కౌర్ వివరించారు. వర్శిటీలోని ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ పంపిస్తున్నామన్నారు. వీడియోల వ్యవహారం బయటపడగానే ఓ యువతి అస్వస్థతకు గురైందని ఆమెను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. 60 ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యాయని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యూనివర్శిటీ ఛాన్సలర్ డాక్టర్ బవా స్పష్టం చేశారు. ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. అలాగే చండీగఢ్ వర్శిటీలో ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని చెప్పారు. ఈ ఘటన అనంతరం ఆ యూనివర్శిటీలో ఆందోళనలు మిన్నంటాయి. దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.

పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ఆందోళనలపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ స్పందించారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని, విద్యార్థినులు ఆందోళన విరమించాలని ఆయన కోరారు. ఇది చాలా సున్నితమైన అంశం. మన సోదరీమణులు, కుమార్తె ల గౌరవానికి సంబంధించినది అని మంత్రి పేర్కొన్నారు.

దోషులను వదిలిపెట్టేది లేదు : పంజాబ్ సిఎం

అంతకుముందు పంజాబ్ సిఎం భగవంత్ మాన్ స్పందిస్తూ మన బిడ్డలు మనకు గర్వకారణమని, ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన సంఘటన గురించి ఆదివారం తెలుసుకుని చాలా విచారిస్తున్నట్టు తెలిపారు. అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపారు. దోషులను నిర్ధారించి వారెంతటి వారైనా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో తాను నిరంతరం మాట్లాడుతున్నానని చెప్పారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వదంతులను నమ్మ వద్దని కోరింది. హాస్టల్‌లో స్నానం చేస్తున్న విద్యార్థినుల వీడియోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయ్యాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులు నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఏడుగురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నట్టు వదంతులు ప్రచారమవుతున్నాయని, వాస్తవానికి అలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదని తెలిపింది.

ఇది చాలా తీవ్రమైన ఘటన : కేజ్రీవాల్

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఇది చాలా తీవ్రమైన ఘటన అని పేర్కొన్నారు. ఇందులో భాగమైన దోషులందరికీ కఠినశిక్ష పడుతుందన్నారు బాధిత విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని వారి వెంట తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు. మరోవైపు వర్శిటీ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ స్పందించింది. కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ డిజిపి, వర్శిటీ వీసికి చైర్‌పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News