శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గలో బీఈ గ్రాడ్యుయేట్ అయిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తీర్థహళ్లికి చెందిన షరీక్, మంగళూరుకు చెందిన మాజ్ మునీర్ అహ్మద్ (22), శివమొగ్గకు చెందిన సయ్యద్ యాసిన్ (21)పై నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ 1967 చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ చట్టం) కింద శివమొగ్గ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు జాతీయ జెండాను తగులబెట్టినట్లు గుర్తించారు.
పోలీసు సూపరింటెండెంట్ బిఎమ్ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, “వారు ఉగ్రవాద సంస్థ ప్రభావంతో వ్యవహరిస్తున్నారని తేలింది. వారు ఉగ్రవాద చర్యకు కుట్ర పన్నారని, వారి సిద్ధాంతాలను ప్రకటించి, అనుసరించారని’’ ఆరోపించారు. ముఠా సభ్యులు పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారని, రాష్ట్రవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశారని పోలీసులు ఆరోపించారు. పోలీసు ఎఫ్ఐఆర్ ప్రకారం, ముఠా సభ్యులు భారతదేశ ఐక్యత, సమగ్రత , సార్వభౌమత్వానికి హాని కలిగించే ఐఎస్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. కాగా నిందితులను సెప్టెంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి తరలించారు. ఈ ముగ్గురికి ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర అన్నారు.