బాంబే హైకోర్టు ఆదేశాలు.. రూ. 10 లక్షల జరిమానా
ముంబై : కేంద్రమంత్రి నారాయణ రాణెకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ముంబై లోని ఆయన ఇంటివద్ద అక్రమ కట్టడాలను కూల్చేయాలంటై మున్సిపల్ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆయనకు రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది. ముంబై లోని జుహూ తీరం లోని నారాయణ రాణె బంగ్లా నిర్మాణంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నిబంధనలు ఉల్లంఘించారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు అందింది. దీంతో బీఎంసీ అధికారుల తనిఖీలో అక్రమ కట్టడాల వ్యవహారం వెలుగు లోకి వచ్చింది. అయితే ఆ కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు రాణె కుటుంబానికి చెందిన కంపెనీ దరఖాస్తు చేసుకుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఆ దరఖాస్తును బీఎంసీ తిరస్కరించింది. దీంతో ఆ కంపెనీ మరోసారి దరఖాస్తు చేసింది.
ఈ దరఖాస్తును పరిశీలించేలా బీఎంసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసి పుచ్చింది. ఈ దరఖాస్తును అంగీకరిస్తే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినట్టవుతుందని కోర్టు అభిప్రాయపడింది. రాణె కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపట్టిందని, బీఎంసీ నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని నిర్ధారణ అయ్యిందని న్యాయస్థానం తెలిపింది. అందువల్ల రాణె బంగ్లాలో అక్రమంగా నిర్మించిన ఆ కట్టడాలను రెండు వారాల్లోగా కూల్చేయాలని బీఎంసీ అధికారులను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత వారానికి కూల్చివేతకు సంబంధించిన నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. జరిమానా రూ. 10 లక్షల మొత్తాన్ని రెండు వారాల్లోగా మహారాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. అయితే దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని అందువల్ల ఆ ఉత్తర్వులపై ఆరు వారాల పాటు స్టే విధించాలని రాణె తరఫు న్యాయవాది హైకోర్టును కోరగా దానికి న్యాయస్థానం తిరస్కరించింది.