గుజరాత్ ఓటర్లకు కేజ్రీవాల్ వాగ్దానం
వడోదర: ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ తరహాలోనే పాత పెన్షన్ పథకాన్ని(ఓపిఎస్) అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయడానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉత్తర్వులు జారీచేశారని మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేజ్రీవాల్ తెలిపారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండు చేస్తూ గుజరాత్‌లో ప్రభుత్వ ఉద్యోగులు వీధులకెక్కి ఆందోళన చేశారని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గుజరాత్‌లో ఓపిఎస్ అమలు చేస్తామని వాగ్దానం చేస్తున్నానని ఆయన చెప్పారు. ఇలా ఉండగా..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మంగళవారం ఉదయం తమ పార్టీ గుజరాత్‌లో అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందని హామీ ఇవ్వడం విశేషం.