మహబూబ్ నగర్: హన్వాడ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ పార్క్ ద్వారా స్థానికులైన వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ఫుడ్ పార్క్ కోసం అవసరమైన భూసేకరణలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హన్వాడ మండల కేంద్రంలో కొత్త పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 175 మంది లబ్ధిదారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఫుడ్ పార్క్ కోసం అవసరమైన సుమారు 350 ఎకరాల భూ సేకరణలో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల నుంచి సేకరించే భూమికి భూమినే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. బాగుపడుతుంటే ఓరో లేక కుట్రలు చేసే అభివృద్ధి విరోధకులను పట్టించుకోవద్దని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో రూ.200 పింఛన్ మాత్రమే ఇచ్చేవారని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజలకు ఎలాంటి వాగ్దానం ఇవ్వకపోయినా పింఛన్ ను రూ.2016, రూ. 3016 పెంచి అందించారని తెలిపారు. ఒక్క హన్వాడ గ్రామంలోనే తెలంగాణ ఏర్పాటుకు ముందు 663 మంది లబ్ధిదారులకు రూ.1.65 లక్షల పింఛన్లు మాత్రమే ఇచ్చే వారని… రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 733 మందికి రూ.16.42 లక్షలు పించన్లుగా అందిస్తున్నామని తెలిపారు. 8 ఏళ్లలో కేవలం పింఛన్ల కోసమే రూ. 16.25 కోట్లు ఇచ్చామన్నారు. 70 ఏళ్లలో సమైక్య ప్రభుత్వాలు హన్వాడ అభివృద్ధికి ఈ స్థాయి నిధులు కూడా ఇవ్వలేదని తెలిపారు. పింఛన్లు రూ. 2016, రూ. 3016 ఇవ్వడం ప్రారంభించిన తర్వాతనే వృద్ధ తల్లితండ్రులకు వారి సంతానం నుంచి పలకరింపు మొదలైందన్నారు. ఇది సీఎం కేసీఆర్ ఘనత అని తెలిపారు.
హన్వాడ గ్రామంలో రైతు బంధు కింద 14115 మంది రైతులకు రూ.12.10కోట్లు, రైతు బీమా పథకం కింద 122 మంది రైతుల కుటుంబాలకు రూ.9.10కోట్లు, హన్వాడ మండలంలో ఇప్పటివరకు 1469 మందికి కల్యాణలక్ష్మి కింద రూ.12.77కోట్లు, 76 మందికి షాదీ ముబారక్ ద్వారా రూ.64.25 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్రంలోనైన ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించారు.
Srinivas Goud distributes Aasara Pensions in Hanwada Mandal