భోపాల్ : నమీబియా నుంచి తీసుకువచ్చి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కు లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లలో ఎనిమిది చీతాలను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఒక నెలపాటు ఇక్కడే క్వారంటైన్‌లో ఉండనున్న వీటి భద్రత కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇతర వన్య ప్రాణుల నుంచి ఈ చీతాలకు రక్షణగా రెండు గజరాజులను ఏర్పాటు చేశారు. నర్మదాపురం సాత్పురా టైగర్ రిజర్వు నుంచి తీసుకు వచ్చిన ఈ గజరాజుల పేర్లు లక్ష్మీ, సిద్ధాంత్. గస్తీ విధుల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వీటిని నెల రోజుల క్రితమే ఇక్కడికి తీసుకువచ్చారు.
చీతాలను ప్రవేశ పెట్టకముందు వాటికోసం తయారు చేసిన ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ల లోకి చొరబడిన నాలుగు చిరుతలను తరిమికొట్టడంలో ఇవి కీలక పాత్ర వహించాయి. ఇప్పుడీ రెండు ఏనుగులు ఎన్‌క్లోజర్‌లలో ఉన్న చీతాలను పర్యవేక్షిస్తున్నాయి. 30 ఏళ్ల సిద్ధాంత్‌కు పులుల రెస్కూ ఆపరేషన్‌లలో రాష్ట్రం లోనే గుర్తింపు ఉందని డీఎఫ్‌ఓ ప్రకాశ్ కుమార్ వర్మ చెప్పారు. 2021 జనవరిలో ఓ పులిని తరిమికొట్టడంలో ఈ ఏనుగు ముఖ్యపాత్ర పోషించిందని తెలిపారు. అయితే ఈ సిద్ధాంత్ ఏనుగుకు కోపం చాలా ఎక్కువేనట. మరో గజరాజు 25 ఏళ్ల లక్ష్మి. శాంతస్వభావం కలిగినదని పేర్కొన్నారు. సఫారీ, రెస్కూ ఆపరేషన్‌లు, జంగిల్ పెట్రోలింగ్‌లో లక్ష్మికి నైపుణ్యం ఉందన్నారు.