Friday, December 20, 2024

ఉప్పల్‌లో టికెట్ల గోల్‌మాల్?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆదివారం భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య టి20 మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఇక చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో దీన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు క్రికెట్ ప్రేమీకులు తహతహలాడుతున్నారు. అయితే మ్యాచ్‌ను చూడాలనే వేలాది మంది అభిమానుల ఆశలపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధికారులు నీళ్లు చల్లారు. మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే 39 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించామని హెచ్‌సిఎ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. నిమిషాల వ్యవధిలో ఇన్ని వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గతంలో టికెట్ల అమ్మకాలను టికెట్ కౌంటర్ల ద్వారా విక్రయించేవారని, క్యూలైన్లలో నిలిచిన వారికి టికెట్లు దొరికేవని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి ఆన్‌లైన్ ద్వారా టికెట్లను విక్రయించడంతో చాలా మందికి అవి అందలేదని వాపోతున్నారు.
ఇదే సమయంలో హెచ్‌సిఎకు చెందిన కొందరూ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది హెచ్‌ఆర్‌సిఎలో ఫిర్యాదు చేశారు. ఇక రెండో విడత టికెట్ల విక్రయానికి సంబంధించి హెచ్‌సిఎ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో టికెట్ల అక్రమాల అంశం మరింత చర్చనీయాంశంగా తయారైంది. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో జరిగే మ్యాచుల్లోనే ఇలాంటి ఆరోపణలు రావడం సర్వసాధారణంగా మారింది. అయినా కూడా టికెట్ల అక్రమాల విషయంలో అటు బిసిసిఐ పెద్దలు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సహకారం అందించండి:శాట్స్ చైర్మన్‌కు అజర్ విజ్ఞప్తి
ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టి20 మ్యాచ్ విజయవంతమయ్యేల తమవంతు సహకారం అందించాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిని కోరారు. మ్యాచ్ సజావుగా సాగేలా శాట్స్ అండగా నిలువాలని అజర్ విజ్తప్తి చేశారు. దీనికి శాట్స్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. మ్యాచ్ విజయవంతంగా నిర్వహించేందుకు శాట్స్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో హెచ్‌సిఎ కార్యదర్శి విజయానంద్, డిఎస్‌పి వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Fans alleges unavailable tickets of IND vs AUS 3rd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News