న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించనున్నది. ఈమేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. సీజేఐ జస్టిస్ లలిత్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఫుల్ కోర్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం లోనే సుప్రీం కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. తొలుత రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్ చేయనున్నారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు యూట్యూబ్‌లో వీటిని టెలికాస్ట్ చేయాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీం కోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను తయారు చేసుకోనుందని తెలిపాయి. ఇటీవల దేశ చరిత్ర లోనే తొలిసారిగా సుప్రీం కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వి రమణ పదవీ విరమణను పురస్కరించుకుని ఆగస్టు 26న ప్రత్యేకంగా సమావేశమైన సెరిమోనియల్ ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా వెబ్‌కాస్టింగ్ చేశారు. అయితే కేసుల విచారణలను లైవ్ స్క్రీనింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీం కోర్టు 2018 లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణ లోకి రాలేదు. సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సహా పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోర్టు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది. కానీ దాన్ని అమలు చేయడంలో జాప్యం జరిగింది. తాజాగా వచ్చేవారం నుంచి లైవ్ స్క్రీనింగ్‌ను ఆచరణలో పెట్టనున్నారు.