ఇడి చార్జిషీట్‌లో వెల్లడి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన పంకజ్ మిశ్రా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు రాజకీయ ప్రతినిధిగా అధికారం చెలాయిస్తూ సోరెన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. జార్ఖండ్ రాజధాని రాంచిలోని ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టులో పంకజ్ మిశ్రాతోపాటు ఆయన ఇద్దరు అనుచరులపై ఈ నెల 16న దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఇడి ఈ ఆరోపణలు చేసింది. ఈ చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సెప్టెంబర్ 20న ప్రత్యేక కోర్టు అంగీకారం తెలిపిందని ఇడి ఒక ప్రకటనలో తెలిపింది. సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హాయిత్ అసెంబ్లీ స్థానానికి సోరెన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా పంకజ్ మిశ్రా సంపాదించిన దాదాపు రూ. 42 కోట్లను ఇడి గుర్తించిందని తెలిపింది.