అభినందించిన ఎఐఎం అధినేత అసదుద్దీన్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సంస్థల్లో ఒకటైన వరల్డ్ టీన్ పార్లమెంటుకు హైదరాబాద్ కు చెందిన జూనియర్ కాలేజీ విద్యార్థి ఎంపికయ్యారు. మలక్‌పేట ఎంఎస్ యూనియర్ కాలేజీలో బిపిసి చదువుతున్న సుమేరా ఉమ్మె కుల్సుమ్‌ను యునెస్కో నిర్వహించే వరల్డ్ టీన్ పార్లమెంటు సభ్యురాలిగా ఎంపిక చేశారు. వరల్డ్ టీన్ పార్లమెంటుకు ఎంపికైన సభ్యులు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఒక విధానాన్ని సిద్దం చేస్తారు. వారి సూచనలు అమలు చేయడం ద్వారా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. టీన్ పార్లమెంటుకు ఎంపికైన విద్యార్థిని సుమేరా ఉమ్మె కుల్సుంను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి అభినందించారు.
బుధవారం ఉమ్మె కుల్సుం దారుస్సలాంలోని ఎఐఎం కార్యాలయంలో అసదుద్దీన్ ఒవైసిని కలిశారు. ఈ సందర్భంగా కుల్సుంను, ఆమె తండ్రి ఎండి రఫీక్‌ను ఒవైసి ప్రత్యేకంగా అభినందించారు. యునెస్కో నిర్వహిస్తున్న ఈ ప్రపంచ టీన్ పార్లమెంటుకు 100 మంది సభ్యులు ఎన్నికయ్యారని వారిలో సుమేరా ఉమ్మె కుల్సుం ఒకరు కావడం ప్రపంచ రికార్డు అని ఒవైసి అన్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కొ ఆధ్వర్యంలో వరల్ట్ టీన్ పార్లమెంటు నిర్వహిస్తున్నందున దాని సూచనలు, , చట్టాలు అన్ని దేశాల్లో వర్తిస్తాయి. ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వరల్డ్ టీన్ పార్లమెంటు సభ్యుల ఎన్నిక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల నుండి దరఖాస్తులు తీసుకొని ఎంపిక చేస్తారు.