Saturday, December 21, 2024

నైరుతి నిష్క్రమణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు ఈ రంగంపై ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి ఉన్న వర్తక , వాణిజ్య , పారిశ్రామిక సేవారంగాలకు నైరుతి మంచి ఊపునిచ్చింది. రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించటం, అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవటంతో వానాకాల పంటల సాగు జోరుమీద సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు రాష్ట్రంలో ఆర్ధిక రంగానికి పెద్ద చోదకశక్తిగా నిలిచాయి. జూన్ నుంచి సెంప్టెంబర్ వరకూ నాలుగు నెలల పాటు నైరుతి రుతుపనాలు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిపిరించాయి. ఈ సారి జూన్ రెండవ వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు తిరోగమనం బాట పట్టాయి. రాజస్తాన్‌తోపాటు దాని పరిసర కచ్ ప్రాంతాల్లో ఇప్పటికే వైదలగాయి. తెలంగాణ నుంచి కూడా నిష్క్రమిస్తున్నాయి. రుతుపవనాలకు , అల్పపీడనాలు , ఉపరితల ఆవర్తనాలు జతకలవడంతో ఈ సీజన్‌లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం 720.4మి.మి కాగా, ఈ సమయానికి 685.5మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుంది.

అయితే ఇప్పటివరకూ 1051.2మి.మి వర్షపాతం రికార్డయింది. గత ఏడాది ఇదే సమయానికి 910.3మి.మి వర్షపాతం నమోదు కాగా, ఈ సారి గత ఏడాది కంటే 140.7శాతం అధికంగా వర్షం కురిసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే రాష్ట్రంలో 53శాతం అధిక వర్షాలు కురిశాయి. జూన్‌లో 129.3మి.మి సాధారణ వర్షపాతానికి గాను 150.6మి.మితో 16శాతం అధికవర్షపాతం నమోదయింది. జులైలో 244.4మి.మికుగాను539.9మి.మి వర్షంతో 121శాతం అధిక వర్షపాతం నమోదయింది. ఆగస్ట్‌లో 219.6మి.మికుగాను 186.2 మి.మి వర్షంతో 15శాతం లోటు వర్షపాతం నమోదయింది. ఈ నెలలో 127మి.మి సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటివరకూ 174.5మి.మి వర్షంతో 89.26శాతం అధిక వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలో జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 30జిల్లాల్లో అధిక వర్షపాతరం నమోదు కాగా, ఖమ్మం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది.

మంచిర్యాలలో రికార్డు స్థాయిలో 61శాతం అధికం

రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో 61శాతం అధిక వర్షపాతం నమోదయింది. పెద్దపల్లిజిల్లాలో 59శాతం, ములుగు జిల్లాలో 57శాతం, జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 50శాతం అధికంగా వర్షాలు దంచికొట్టాయి. రాష్ట్రంలో ఆయా జిల్లాల సగటు కంటే కొంచెం ఎక్కువగా, రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే అతితక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లో హనుమకొండలో 2శాతం, నారాయణపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 4శాతం , జనగాం, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మహబూబ్ నగర్ ,మహబూబాబాద్ , జిల్లాల్లో 9శాతం అధికంగా వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లాలో 10శాతం అధికంగా వర్షపాతం నమోదయింది.

17శాతం లోటులో నల్లగొండ

రాష్ట్రంలోని 33జిల్లాల్లో మూడు జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే స్వల్పంగా లోటు వర్షపాతం నమోదయింది. అందులో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 17శాతం లోట వర్షపాతం నమోదుకాగా, ఖమ్మం జిల్లాలో 9శాతం, సూర్యాపేట జిల్లాలో 3శాతం తక్కవగా వర్షపాతం నమోదయింది.

మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు:

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 5.8 ఎత్తువరకూ కొనసాగుతున్నట్టు తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 48గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో గురు ,శుక్ర వారాల్లో అక్కడక్కడా ఉరుములు , మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News