మంత్రి ఎదుటే అజారుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 25న జరగనున్న భారత్‌ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించి జింఖానా గ్రౌండ్‌లో గురువారం టికెట్లు విక్రయించగా తొక్కిసలాట జరిగింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ను, ఇతర కార్యవర్గ సభ్యులను పిలిపించి మాట్లాడారు. అయితే ఇంత జరిగినప్పటికీ అజారుద్దీన్ మాత్రం లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి, మీడియా ఎదుటే ఆయన వితండవాదం చేశారు. ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయని ఆజారుద్దీన్ వ్యాఖ్యానించారు.
తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని, తమకు మ్యాచ్ నిర్వహణే ముఖ్యమని మంత్రి ఎదుటే ఆజారుద్దీన్ రివర్స్ అయ్యారు. అటు టికెట్ల గోల్‌మాల్ వ్యవహారాన్ని కూడా ఆజారుద్దీన్ లైట్ తీసుకున్నారు . గురువారం జరిగింది దురదృష్టకర ఘటనేనన్న ఆయన మాకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. మీ దగ్గర కూర్చోని ముచ్చట్లు చెప్పడానికి తనకు టైమ్ లేదని అజారుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను వెళ్లి మ్యాచ్ నిర్వహణ చూసుకోవాలని, మ్యాచ్ నిర్వహణ అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడినంత తేలిక కాదని అజారుద్దీన్ అన్నారు. ఇంత జరిగినా తమ తప్పు లేదంటున్నారు. మ్యాచ్ టికెట్లన్నీ అయిపోయాయని, ఆన్‌లైన్‌లో పెట్టడానికి కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు. ఎన్ని టికెట్లు అమ్మాము అన్నది శుక్రవారం చెబుతామని పేర్కొన్నారు.