బిజెపి వ్యంగ్యోక్తులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరైనప్పటికీ ఆయన గాంధీ కుటుంబానికి ప్రాక్సీగానే ఉంటారని, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాగా వారి రిమోట్ కంట్రోల్‌తోనే పని చేస్తారని బిజెపి శుక్రవారం వ్యాఖ్యానించింది. తన వారసుడిని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అజయ్ మాకెన్‌లు నిర్ణయిస్తారంటూ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చని భావిస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ప్రకటనను బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు.‘ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆమె మాజీ అధ్యక్షురాలు అవుతారు. అలాంటప్పుడు ఆమెకు ఏ హోదా ఉంటుంది.
కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు నిర్ణయం తీసుకోకూడదా? గాంధీల చేతిలోనే రిమోట్ కంట్రోల్ ఉంటుంది, అలాంటప్పుడు ఈ బూటకపు ఎన్నిక ఎందుకు?’ అని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. కొత్త అధ్యక్షుడు ఎవరైనా రాహుల్ గాంధీకి పార్టీలో ప్రముఖ స్థానం ఉంటుందంటూ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం ఇటీవల చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్‌ను సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేసినట్లుగా కొత్త అధ్యక్షుడు కూడా గాంధీలకు ప్రాక్సీగా ఉంటారనే దానికి ఈ ప్రకటనలే నిదర్శనమని పూనావాలా అన్నారు.